చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డిఎంకె ఎమ్మెల్యే అనిత ఆర్. రాధాకృష్ణన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను పరిశీలించిన జడ్జి జి.కె.ఇళంతిరైయన్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికైన ముఖ్యమంత్రి పట్ల మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అంతటి అవమానకరమైన భాషను ఎలా మాట్లాడగలరని జడ్జి ప్రశ్నించారు. ఆయన సామాన్య వ్యక్తి కాదు కదా.. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు లేదా అని జడ్జి ఎమ్మెల్యేను నిలదీశారు. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని పిటిషన్‌ను తిరస్కరించారు.
ఆ ప్రసంగం అవమానకరంగా ఉన్నప్పటికీ.. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని ఎమ్మెల్యే అనిత. ఆర్.రాధాకృష్ణన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణపై కేసు నమోదు చేశారని, అయితే ఆయన వ్యాఖ్యలు ఆ ఉద్దేశ్యాన్ని వెల్లడించవని పేర్కొన్నారు.
డిఎంకె ఎమ్మెల్యే ముఖ్యమంత్రిపై అత్యంత అభ్యంతరకరమైన, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. డిఎంకె నిర్వహించిన బహిరంగ సభ అనంతరం పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోయి ఉంటే, ఆ వ్యాఖ్యలు డిఎంకె, పాలక టివికె కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసేవని ఆయన పేర్కొన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ముఖ్యమంత్రి గురించి ఇలా మాట్లాడటం ఎంతమాత్రం సమంజసం కాదని అన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు .. ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి ఎటువంటి కారణం కనిపించలేదని ఉత్తర్వులో పేర్కొంది. అయితే ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ మొదట మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్‌లో దాఖలు చేశారు. ఆ తర్వాత అది ప్రధాన కోర్టుకు బదిలీ అయింది.








కామెంట్‌లు (0)