మంత్రి అధవ్ అర్జున్ ఫిర్యాదుతో చర్యలు
చెన్నై : డిఎంకె అధ్యక్షుడు ఎం కె స్టాలిన్, పార్టీ ఐటి సంస్థకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 15 నాటికి నోటీసుపై సమాధానమివ్వాలని జస్టిస్ కె.గోవిందరాజన్ తిలకవడి ఆదేశించారు. మాదకద్రవ్యాల కేసులో నిందితుడైన జాన్ బ్రిట్టో తనకు బంధువు అంటూ ఎక్స్‌లో చేసిన పోస్టుకు సంబంధించి, కోటిరూపాయల నష్టపరిహారం కోరుతూ తమిళనాడు ప్రజా పనులు, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి అధవ్ అర్జున్ సివిల్ దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టు ప్రాథమికంగా అసత్యమని, అత్యంత పరువునష్టం కలిగించేదని మంత్రి తరపు న్యాయవాది ఎ.పి.సూర్యప్రకాశం వాదించారు. డిఎంకె ఐటి విభాగం తమ అధికారిక ఖాతాలో జూన్ 8న ఎక్స్‌లో ఈ పోస్ట్ చేసినట్లు ఆరోపించారు. ఆ సోషల్ మీడియా పోస్ట్ పార్టీ కార్యకర్త చర్య కాదని, రాజకీయ పార్టీ వ్యవహారాలపై పూర్తి నియంత్రణ కలిగిన మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాల మేరకే పోస్ట్ చేశారని పిటిషన్ పేర్కొంది. భవిష్యత్తులో ఇటువంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను పోస్ట్ చేయకుండా స్టాలిన్, డిఎంకె ఐటి విభాగాన్ని నిరోధించే శాశ్వత నిషేధాజ్ఞను జారీ చేయాలని మంత్రి కోర్టును కోరారు.








కామెంట్‌లు (0)