న్యూఢిల్లీ : రష్యా, ఇరాన్‌లపై అమెరికా ఆంక్షలు విధించే బిల్లుపై భారత విదేశాంగ శాఖ (ఎంఇఎ) గురువారం స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించి తదుపరి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ అంశాన్ని అమెరికాకు చెందిన వివిధ ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లామని వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలపైనే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై కూడా ఈ బిల్లు తీవ్ర ప్రభావం చూపనుందని, ఈ అంశాలను భారత ప్రతినిధులు వివరించారని ఎంఇఎ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దేశ ప్రభుత్వం 140 కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రతను కల్పించే విషయంలో దృఢమైన నిబద్ధతతో ఉందని ఆ ప్రకటన పేర్కొంది. ఇంధన వనరుల సేకరణలో వైవిధ్యం, మారుతున్న మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఈ భద్రతను నిర్ధారించుకుంటామని తెలిపింది. తమ వాణిజ్య మరియు ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎంఇఎ స్పష్టం చేసింది. ఈ పరిణామాల వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం భారతీయ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేస్తుందని పేర్కొంది.
రష్యా నుండి చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకుంటున్న భారత్ సహా ఇతర దేశాలపై 100శాతం సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొందేలా ఒక బిల్లును ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదించిన సంగతి తెలిసిందే.







కామెంట్‌లు (0)