సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇస్రోను బలహీనపరుస్తున్న మోడీ సర్కార్‌

1 గంట క్రితం

jairam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 01:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రైవేటీకరణపై జైరామ్‌ రమేష్‌ ధ్వజం

​ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బలహీనపరుస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్‌) జైరామ్‌ రమేష్‌ విమర్శించారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆరు దశాబ్దాలుగా అంతరిక్ష సామర్థ్యాలను పటిష్టం చేయడంలో ఇస్రో కీలక పాత్ర పోషించిందన్నారు. విక్రమ్‌ సారాభాయ్‌, సతీష్‌ ధావన్‌, బ్రహ్మ ప్రకాశ్‌, యు.ఆర్ రావు, ఎపిజె అబ్దుల్‌ కలాం తదితర ప్రముఖ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల దూరదృష్టి, అంకితభావం, నాయకత్వంతో ఇస్రో ప్రపంచ స్థాయిలో దేశానికి గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. ఇస్రోను బలహీనపరిచేందుకు ప్రధానమంత్రి, పిఎంఒ ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. రాకెట్ల అభివృద్ధి, నిర్మాణంలో ఇస్రో పాత్రను గణనీయంగా తగ్గించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఉపగ్రహాలకు సంబంధించిన అనేక ఆస్తులను పూర్తిగా ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తున్నారని ఆయన తెలిపారు. తమిళనాడులోని కులశేఖరపట్నంలో నిర్మిస్తున్న రెండో అంతరిక్ష ప్రయోగ కేంద్రం కోసం ఇస్రో దాదాపు రూ.1,000 కోట్ల మేర పెట్టుబడి పెడుతోందని, ఈ స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌ నిర్వహణ, కార్యకలాపాలను ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ఇన్‌-ఎస్‌పిఎసిఇ ప్రక్రియ ప్రారంభించింద‌ని, ఇందుకోసం ప్రైవేట్‌ సంస్థలను ఆహ్వానించింద‌న్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రక శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం భవిష్యత్‌ కూడా అగమ్యగోచరమన్నారు. అలాగే, గత కొన్ని నెలల్లో దాదాపు 120 మంది కీలక నిపుణులు రాజీనామా చేశారని, 100 మందికి పైగా శాస్త్రవేత్తలు కూడా రాజీనామా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మాజీ ఇస్రో చైర్మన్‌ జి. మాధవన్‌ నాయర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని జైరామ్‌ రమేష్‌ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్