- 16 మెట్రో స్టేషన్లు మూసివేత, ఢిల్లీలో ఆంక్షల వలయం
న్యూఢిల్లీ: సీజేపీ ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థి–యువజన ఆందోళనకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుందనే భయంతో కేంద్ర మోడీ ప్రభుత్వం రాజధాని ఢిల్లీలో కఠిన ఆంక్షలు అమలు చేసిందని నిరసనకారులు ఆరోపించారు. కేంద్ర ఆదేశాల మేరకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) 16 కీలక మెట్రో స్టేషన్లను మూసివేయగా, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెట్రో స్టేషన్ల మూసివేత, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు, విస్తృత బారికేడ్లు కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
సోమవారం నిర్వహించిన యూత్ పార్లమెంట్ మార్చ్ నేపథ్యంలో విధించిన ట్రాఫిక్ ఆంక్షలు బుధవారం కూడా కొనసాగడంతో రాజధానిలో అనేక ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన ప్రభుత్వం, నిరసనలను అణచివేసేందుకు నగరాన్నే నిర్బంధంలోకి నెట్టిందని ఆందోళనకారులు విమర్శించారు.
జంతర్‌మంతర్ పరిసర ప్రాంతాల్లో ముందస్తు సమాచారం లేకుండానే ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల గొంతు నొక్కేందుకు రవాణా, సమాచార వ్యవస్థలను పరిమితం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నిరసనకారులు ఆరోపించారు.







కామెంట్‌లు (0)