పోలీసులకు ‘రిటర్న్ గిఫ్ట్ ’
విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ నేతలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశవ్యాప్త ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. బుధవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్ ఎం సాజి, సృజన్ భట్టాచార్య, సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్, ఉపాధ్యక్షులు ఎస్ శిల్ప మాట్లాడారు. గురువారం రాజ్‌భవన్‌లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. శుక్రవారం దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ తరహాలో నిరసన వేదికలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాత్రిపూట కాగడా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ ర్యాలీలో డివైఎఫ్ఐ, ఐద్వా, సిఐటియు, ఎఐకెఎస్, ఎఐఎడబ్ల్యుయు వంటి సంఘాలు కూడా పాల్గొంటాయన్నారు.
పార్లమెంటు మార్చ్‌పై పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా ‘రిటర్న్ గిఫ్ట్’ ప్రచారాన్ని కూడా ప్రకటించారు. శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి మెలోడీ చాక్లెట్లను పంపిణీ చేయనున్నామన్నారు. తాము మెలోడీని ఎందుకు పంపిణీ చేస్తున్నామో అందరికీ తెలుసని తెలిపారు. పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోస్టర్, బ్యానర్ ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. ‘జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగుతుంది. నిరసనకారులపై పోలీసుల క్రూరత్వంపై విచారణ జరపాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించనున్నాం. దాడులపై విచారణ జరిపేందుకు ఎస్ఎఫ్ఐ ఒక ‘ప్రజా కమిషన్’ను ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్ ఏర్పాటు కోసం ప్రస్తుతం మాజీ న్యాయమూర్తులతో చర్చిస్తోంది. మార్చ్‌లో పాల్గొన్న మహిళలతో సహా అందరి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నిరసనకారులపై లాఠీచార్జి, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడంతో పాటు, పోలీసులు పెల్లెట్ గన్లు, మేకులు దింపిన లాఠీలు, విద్యుత్ షాక్‌లు కూడా ఉపయోగించారు. ఢిల్లీ పోలీసులు గ్యాంగ్‌స్టర్ పోలీసులుగా తయారయ్యారు’ అని విమర్శించారు. ‘పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జరిగిన పోలీసుల క్రూరత్వంపై సుప్రీంకోర్టు స్పందన బాధాకరం. ఎస్ఎఫ్ఐకు, నిరసనకారులకు వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. నిరసనలో పాల్గొన్న వారికి వీసాలు నిరాకరిస్తామన్నది ఆ ప్రచారం. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి కూడా పోలీసులు అనుమతించలేదు’ అని పేర్కొన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కూడా విలేకరుల సమావేశానికి హాజరయ్యారు. వారిని నడుము కింద కొట్టకుండా, పోలీసులు తలపై కొట్టారు. తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని యుపి రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ వహాబ్, ఉపాధ్యక్షుడు దుర్గేష్ యాదవ్, ఢిల్లీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సఖి విలేకరుల సమావేశంలో తెలిపారు. నీట్ పరీక్ష రాసిన బీహార్‌కు చెందిన విద్యార్థి సచి మాట్లాడుతూ ‘మూడు సార్లు నీట్ పరీక్ష రాశాను. రెండుసార్లు ప్రశ్నపత్రం లీక్ అయింది. జంతర్ మంతర్ వద్ద చాలా మంది నిరసన తెలపడం చూసి ఈ ప్రదర్శనకు వచ్చాను’ అని ఆయన తెలిపారు.







కామెంట్‌లు (0)