- సిపిఎం పొలిట్‌బ్యూరో ఆందోళన
- దేశ ఆర్థిక పరిస్థితిపై మోడీ సర్కార్ తప్పుడు లెక్కలు
- అణిచివేతను అధిగమించి ఉద్యమించిన నిరసనకారులు అభినందనలు
- కోరలుచాస్తున్న కుల వివక్షపై ఆగ్రహం
- ప్రజాస్వామ్య సంస్థలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యపోరాటాలకు పిలుపు
న్యూఢిల్లీ : నేపాల్ జలప్రళయం సహా ఇటీవల చోటుచేసుకున్న అనేక ప్రకృతి వైపరీత్యాలకు కార్పొరేట్ కంపెనీల దురాశే ప్రధానకారణమని, అపరిమిత లాభాల కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేయడం వల్లే వినాశకర పరిస్థితులు నెలకొన్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నెల ఈ నెల 4, 5 తేదీల్లో ఢిల్లీలోని పార్టీ ప్రధానకార్యాలయం ఎకెజి భవన్‌లో పొలిట్‌బ్యూరో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. వాతావరణ మార్పులతో పాటు అయోధ్య రామాలయంలో విరాళాల కుంభకోణం, ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను నిరసిస్తూ సాగుతున్న పోరాటాలు, నిరసన హక్కులను పాలకులు కాలరాస్తున్న వైనం, దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, కార్పొరేట్ కంపెనీలకు, అనుయాయులకు వివిధ రూపాల్లో ప్రజల సంపదను ప్రభుత్వం దోచిపెడున్నవైనం, అలాగే పార్టీ సంస్థాగత దిద్దుబాటు చర్యలపై చర్చలు జరిపింది. సమావేశ నిర్ణయాలను వివరిస్తూ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
పర్యావరణ విధ్వంసమే..
కార్పొరేట్ దురాశతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసమే ప్రకృతి విపత్తులకు కారణమని సిపిఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. వాతావరణ మార్పులు నిదర్శనంగా నేపాల్, చైనాల్లో వరదలు భీభత్సం సృష్టించడం, వందలాది మందిని బలిగొనడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హిమానీనదాలు వేగంగా కరిపోతుండటం, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు మెరుగ్గా లేకపోవడం వల్ల ఎంతటి వైపరీత్యాలను ఎదుర్కొవాల్సివస్తోందో..నేపాల్‌ను, చైనాను తీవ్రంగా ప్రభావితం చేసిన హిమానీనదాల విపత్తు అద్దంపడుతోందని పొలిట్‌బ్యూరో తెలిపింది. ఎల్ నినో ప్రభావం కూడా తీవ్రంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. అస్సాం వంటి రాష్ట్రాలలో అకాలం వరద భీభత్సాలు, ఇతర రాష్ట్రాలలో లోటు వర్షపాతం, కరువు లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామని పేర్కొంది. కార్పొరేట్ కంపెనీల దురాశ వల్ల జరిగే పర్యావరణ విధ్వంసమే ఈ తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు ప్రధాన కారణమని తెలిపింది.
అయోధ్య విరాళాల కుంభకోణంతో బయటపడ్డ సంఘ్ పరివార్ నిజస్వరూపం
అయోధ్య రామ మందిరానికి వచ్చిన విరాళాలను సంఘ్ పరివార్ నాయకులు దోచుకున్నారనే ఆరోపణలతో ఒక భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చిందని సిపిఎం పేర్కొంది. సంఘ్ పరివార్ నేతృత్వంలో జరిగిన రామ మందిర ఆందోళనల్లో కీలకంగా ఉన్న వ్యక్తులే ఇప్పుడు ఆలయ విరాళాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇది లక్షలాది మంది ప్రజల విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేయడమే. పవిత్రమైన కానుకలను దోపిడీ సొత్తుగా పరిగణిస్తూ, ప్రజల విశ్వాసాలపై నిర్భయంగా బేరమాడుతున్నారని పొలిట్‌బ్యూరో తీవ్రంగా విమర్శించింది. అయోధ్య కుంభకోణంతో సంఘ్ పరివార్ నిజ స్వరూపం బయటపడిందన్నారు. ఈ కుంభకోణానికి పాల్పడిన దుండగులను రాజకీయ అండదండలతో కాపాడుతున్నారని విమర్శించింది. వీటిపై సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ హేయమైన నేరంలో పాలుపంచుకున్న దోషులందరినీ శిక్షించడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది.
శ్రమజీవులకు, విద్యార్థులకు, యువతకు అభినందనలు..
కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఆగస్టు 10న నిరసనలలో భారీ సంఖ్యలో పాల్గొన్న కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులందరినీ పొలిట్ బ్యూరో అభినందించింది. అలాగే, పరీక్షల పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను, యువతను అభినందించింది. జంతర్ మంతర్ నిరసనల స్ఫూర్తితో, దేశవ్యాప్తంగా విద్యార్థులు పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాలల మూసివేత వంటి పలు అంశాలపై నిరసనలు చేపట్టారు. ఇలాంటి నిరసనలు, ప్రదర్శనలు ప్రజలు ముఖ్యంగా యువత కేంద్ర ప్రభుత్వం, దాని అణచివేత చర్యల పట్ల తమ భయాన్ని కోల్పోతున్నారని వెల్లడిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల వంటి మతపరమైన సమస్యలను, పోరాటాలను ప్రోత్సహించడం ద్వారా ఇలాంటి నిజమైన నిరసనల నుండి ప్రజల దృష్టిని మళ్లించి, వారి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
నిరసన హక్కులను కాలరాయడం
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన 'దిమాగీ నక్సల్' (మేధావి నక్సల్) వ్యాఖ్య చట్టబద్ధమైన రాజకీయ అసమ్మతిని అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని సిపిఎం పేర్కొంది. ఈ పదం సాయుధ మావోయిస్టులకు, శాంతియుత ప్రజాస్వామ్య ప్రతిపక్షానికి మధ్య ఉన్న గీతను చెరిపేసే ఒక ప్రమాదకరమైన రాజకీయ ఆయుధమని పేర్కొంది. ఈ వాక్చాతుర్యం భద్రతకు సంబంధించినది కాదు, రాజకీయ బహిష్కరణకు సంబంధించినది. విమర్శకులను చట్టవిరుద్ధం చేయడానికి, అసమ్మతిని అణచివేయడానికి, విద్య, ఉపాధి, ప్రజా సంక్షేమం వంటి ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఒక భావజాల శత్రువును సృష్టించడానికి ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నంగా పేర్కొంది.
అలాగే, ఢిల్లీలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొనకుండా సిపిఐ కార్యకర్తలను అడ్డుకునేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించడాన్ని పొలిట్ బ్యూరో ఖండించింది. ఇలాంటి సంఘటనలన్నీ ప్రజాస్వామ్య సంస్థలు, రాజ్యాంగ నిర్మాణంపై పెరుగుతున్న దాడులను స్పష్టం చేస్తున్నాయి. ఈ దాడులను వ్యతిరేకించి, మనం కష్టపడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి ప్రజలంతా ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేస్తోంది.
వాస్తవాలను దాచి..జిడిపిని పెంచి..
2026-27 మొదటి త్రైమాసికంలో భారతదేశం సాధించిన 7.8 శాతం జిడిపి సాధించినట్లు చెబుతున్న వృద్ధి లెక్కలు దేశ వాస్తవిక ఆర్థిక సంక్షోభ పరిస్థితులను దాచిపెడుతున్నాయని పొలిట్‌బ్యూరో విశ్లేషించింది. ముఖ్యంగా శ్రామిక వర్గపు నిజమైన పరిస్థితిని మరుగుపర్చడానికి, అసమానతలను మరింత పెంచే వ్యవస్థను చట్టబద్ధం చేయడానికి ఒక రాజకీయ సాధనంగా ఈ గణాంకాలు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభం, కేవలం 3.6 శాతం వృద్ధి రేటుతో కుంటుపడుతున్న గనుల రంగం వంటి వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నాయి. అలాగే, ఈ లెక్కలు కార్మికులు, రైతులపై పెరిగిన పెట్టుబడి వ్యయాల భారాన్ని కప్పిపుచ్చుతున్నాయి. ధరల పెరుగుదల, పోషకాహార లోపం, నిరుద్యోగం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న సామాన్య ప్రజల కష్టాలకు ఈ జిడిపి గణాంకాలు పూర్తిగా దూరంగా ఉన్నాయని తెలిపింది.
కార్పొరేట్లకు ప్రయోజనాలు, ఆశ్రిత పక్షపాతం
బిజెపి ప్రభుత్వం సముద్ర మంథన్ ప్రోత్సాహక పథకం, సెమీకండక్టర్ మిషన్ 2.0; మొబైల్ ఫోన్ల తయారీ పథకం, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పథకం.. మొదలైన వాటి ద్వారా దేశీయ, విదేశీ ప్రైవేట్ కార్పొరేట్లకు ప్రజా నిధులను దోచిపెట్టడాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొనసాగిస్తోందని సిపిఎం పేర్కొంది. కేంద్రం అనుసరిస్తున్న ఈ దుర్మార్గపు కార్పొరేట్ ప్రోత్సాహక కార్యక్రమాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. జి గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర విషయంలో ఎన్‌సిఎల్‌టి ఇటీవల ఇచ్చిన ఉత్తర్వు ఈ వనరుల దోపిడిని పూర్తిగా వేరే స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ 2016, వ్యాపార సౌలభ్యం పేరుతో కార్పొరేట్లకు నిధులను మళ్లించడం ద్వారా ప్రజా ధనాన్ని ఈ విధంగా చట్టబద్ధంగా దోచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఐబిసి 2016ను తక్షణమే రద్దు చేసి, దాని స్థానంలో డిఫాల్టర్లను శిక్షించి, ప్రజాధన దోపిడీని అరికట్టేందుకు పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని సిపిఎం డిమాండ్ చేసింది.
జనాభా లెక్కలు, కులాల డేటా
బిజెపి తన హిందుత్వ మతతత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి 2027 జనాభా లెక్కలను ఉపయోగించుకుంటుంది. పదహారేళ్ల విరామం తర్వాత, పౌరసత్వం, ఎన్నికల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశాలు రేగుతున్న తరుణంలో నిర్వహిస్తున్న ఈ 2027 జనాభా లెక్కల ప్రక్రియ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించిన పద్ధతి కూడా పూర్తిగా శాస్త్రీయమైనది కాదు. జనాభా లెక్కల సమాచారాన్ని ఇతర ప్రభుత్వ డేటాబేస్‌లతో అనుసంధానించడం ఒక తీవ్రమైన సమస్య. ఓటర్ల జాబితా ధృవీకరణ, పౌరసత్వం.. వంటి చోట్ల ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారు, ఎలా అనుసంధానిస్తారు అనే దానిపై సహేతుకమైన ఆందోళనలు చెలరేగుతున్నాయి. అలాగే, జనగణన నిర్వహిస్తున్న సమయం కూడా కీలకంగా మారింది. ఎందుకంటే 2026 తర్వాత నిర్వహించే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవచ్చు. కాబటి ఈ 2027 జనగనణ అనేది భవిష్యత్‌లో రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యానికి ఆధారం కానుంది. కాగా, ఈ జనగణనలో కులాల డేటా కోసం అనుసరించిన పద్ధతి కూడా లోపభూయిష్టంగా ఉంది. ఎస్‌సి, ఎస్‌టిలు మాత్రమే అందుబాటులో ఉన్న జాబితా నుండి తమ కులాన్ని/తెగను ఎంచుకోగలరు. మిగిలిన వారి విషయంలో ఇది 'ప్రతివాదిచే ప్రకటించబడినది'గా నమోదు చేస్తారు. కులాల గణనకు సమగ్రమైన, ముందుగా నిర్వచించబడిన జాబితా లేదా వ్యవస్థీకృత యంత్రాంగం లేకపోవడం వల్ల కచ్చితమైన గణాంకాలను పొందడం సాధ్యం కాదు. వివిధ కులాలు, ఉపకులాల నమోదులు జరుగుతాయి.
కోరలు చాచిన కుల వివక్ష ..
2014లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, ఆదివాసులు, ఇతర వెనుకబడిన కులాలపై దాడులు పెరుగుతున్నాయి. ఐఐటి మండి వంటి ప్రతిష్టాత్మక సంస్థకు అధికారులు చతుర్వర్ణ వ్యవస్థను ప్రశంసిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేయడం అత్యంత సిగ్గుచేటు. ‘శూద్రుల కర్తవ్యం అగ్రవర్ణాలకు సేవ చేయడమే’నని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఇది భారత రాజ్యాంగాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే. ఇటువంటి చర్యను ప్రపంచవ్యాప్తంగా ఖండించాలి, ఈ పోస్టర్‌ను విడుదల చేసిన బాధ్యులను గుర్తించి శిక్షించాలి. అదేవిధంగా, ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ వద్ద రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పట్ల వ్యవహరించిన తీరును కూడా ఖండించి, దోషులను శిక్షించాలని సిపిఎం డిమాండ్ చేసింది.
పెరుగుతున్న సంఘర్షణలు, ఉద్రిక్తతలు
ఈ ఏడాది జులై నుంచి రాజకీయ సంఘర్షణలు, ఆర్థిక పరిస్థితులతో అంతర్జాతీయ పరిణామాలు అనిశ్చితితో నిండి ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన, ఆర్థిక మార్కెట్లలో గందరగోళం, అనేక దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభాలు నెలకుని ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై పొలిట్ బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఉద్రిక్తతలు ప్రపంచాన్ని మరోసారి సంక్షోభంలోకి నెట్టాయని తెలిపింది. కొన్ని రోజుల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిస్తున్న భారత్ అమెరికా దురాక్రమణను ఖండించి, తీవ్రమైన దాడులకు గురవుతున్న పాలస్తీనా, ఇరాన్, క్యూబాలకు సంఘీభావం తెలపాలి.
దిద్దుబాటు ఉద్యమం
పార్టీ 24వ కాంగ్రెస్ ఆదేశాల మేరకు జరుగుతున్న సంస్థాగత దిద్దుబాటు చర్యలకు సంబంధించిన నివేదికపై పోలిట్ బ్యూరో చర్చించింది. పార్టీలోని అన్ని స్థాయిలలో సమిష్టి పనితీరును బలోపేతం చేసే చర్యల గురించి చర్చలు జరిగాయి. ఈ నివేదికపై చర్చించడానికి, బలోపేతం చేయడానికి అక్టోబర్ 9-11 తేదీలలో కేంద్ర కమిటీ న్యూఢిల్లీలో సమావేశం కానుంది.








కామెంట్‌లు (0)