శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

NEET-UG 2026 Re-exam Toppers:"మళ్లీ పుస్తకాలు తెరవడం చాలా కష్టంగా అనిపించింది"

1 గంట క్రితం

neet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 07:38 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కారణంగా మొదటి పరీక్ష రద్దు కావడంతో మళ్లీ పరీక్షకు సిద్ధమవడం తమకు మానసికంగా ఎంతో కష్టంగా అనిపించిందని రీ-ఎగ్జామ్‌లో సంయుక్తంగా ఆల్ ఇండియా టాపర్లుగా నిలిచిన ఆర్యన్ గుప్తా, పన్షుల్ బన్సల్ తెలిపారు. వీరిద్దరూ 720 మార్కులకు 715 మార్కులు సాధించి తొలి స్థానాన్ని పంచుకున్నారు.

"మళ్లీ చదవడం కష్టమే" : ఆర్యన్ గుప్తా

లుధియానాకు చెందిన ఆర్యన్ గుప్తా మాట్లాడుతూ.. మొదటి పరీక్షలో తన లెక్కల ప్రకారం 696 మార్కులు వచ్చాయని.. అయితే ప్రశ్నాపత్రం లీక్ కారణంగా పరీక్ష రద్దు కావడం నిరాశ కలిగించిందన్నారు. "రెండేళ్ల పాటు నిరంతరం చదివిన తర్వాత పరీక్ష రద్దయిందని తెలిసినప్పుడు మళ్లీ పుస్తకాలు తెరవడం చాలా కష్టంగా అనిపించింది. కానీ నా సహచరులను చూసి ప్రేరణ పొందాను. దీన్ని మరో అవకాశం అని భావించి మరింత మెరుగ్గా సిద్ధమయ్యాను," అని తెలిపారు.

రీ-ఎగ్జామ్ అనంతరం తనకు మంచి ఫలితం వస్తుందనే నమ్మకం కలిగిందని ఆర్యన్ చెప్పారు."జాతీయ టాపర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ పరీక్ష ముగిసిన వెంటనే నా పేపర్ చాలా బాగా రాశానని తెలిసింది. బయట ఎదురు చూస్తున్న నాన్నకు కూడా అదే చెప్పాను." తన కుటుంబంలో 10 మందికి పైగా వైద్యులు ఉండటంతో చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలనే లక్ష్యం ఏర్పడిందని తెలిపారు. ఈసారి ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు కాస్త కఠినంగా ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నందుకు గర్వంగా ఉందన్నారు.


"పేపర్ లీక్ వల్ల బాధపడ్డాను"

ఢిల్లీలోని కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్ విద్యార్థి పన్షుల్ బన్సల్ కూడా మొదటి పరీక్ష రద్దు కావడం నిరాశ కలిగించిందని చెప్పారు. "పేపర్ లీక్ జరిగినప్పుడు చాలా బాధపడ్డాను. మళ్లీ మొత్తం సిలబస్ చదవాల్సి వచ్చింది. కానీ సానుకూలంగా ఆలోచించి మరో నెల పూర్తిగా ఏకాగ్రతతో సిద్ధమయ్యాను. అదే నాకు ఈ ఫలితాన్ని అందించింది," అని తెలిపారు. మొదటి పరీక్షతో పోలిస్తే రెండో పరీక్షలో ఫిజిక్స్ విభాగంలో పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉండటంతో సమయం ఎక్కువ పట్టిందని బన్సల్ చెప్పారు. అయితే రెండు పరీక్షల కఠినత స్థాయి దాదాపు ఒకేలా ఉందన్నారు. పేపర్ లీక్ ఘటనలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వ్యవస్థ ఉండాలని బన్సల్ డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్