మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionస్తంభించిన పార్ల‌మెంట్‌

2 గంటల క్రితం

eParliament
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 11:38 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ​ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌

  • నీట్ పేప‌ర్ లీక్‌, విద్యార్థుల‌పై లాఠీఛార్జ్‌పై చ‌ర్చకు ప‌ట్టు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : విద్యా రంగ వైఫ‌ల్యాల‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని సిజెపి ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు, యువ‌త చేప‌ట్టిన పార్ల‌మెంట్ మార్చ్‌లో విద్యార్థులు, యువ‌త‌పై లాఠీఛార్జ్ చేయ‌డాన్ని ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా ఖండించాయి. మంగ‌ళ‌వారం ఈ అంశంపై పార్ల‌మెంట్ స్తంభించింది. నీట్ పేప‌ర్ లీక్‌, విద్యార్థుల‌పై లాఠీఛార్జ్‌ల‌పై చ‌ర్చించాల‌ని డిమాండ్ చేస్తూ ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌లు చేప‌ట్టాయి. దీంతో స‌భ‌లు వాయిదాల ప‌ర్వం తొక్కాయి. దేశ రాజధానిలో సిజెపి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా ఆప్ ఎంపిలు పార్లమెంట్ ఆవ‌ర‌ణంలో నినాదాలు చేస్తూ నిర‌స‌న తెలిపారు.

​లోక్‌స‌భ‌ను స్పీక‌ర్ ఓంబిర్లా ప్రారంభించి ప్ర‌శ్నోత్త‌రాలు నిర్వ‌హించేందుకు ప్ర‌య‌త్నించారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి తీసుకొచ్చారు. దీంతో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లోనూ ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న కొన‌సాగింది. దీంతో స‌భ ప్రారంభ‌మైన తొమ్మిది నిమిషాల్లోనే మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు ప్యానెల్ స్పీక‌ర్ సంధ్యా రే వాయిదా వేశారు. అనంత‌రం ప్రారంభ‌మైన స‌భ‌లో ప‌రిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ప్యానెల్ స్పీక‌ర్ దిలీప్ సైకియా నియమం 377 ప్రకారం, సభ్యులు తమ తమ స్థానాలలో కూర్చొని, సభా కార్యకలాపాలను కొనసాగించాలని కోరారు. ప్రతిపక్షాల ఆందోళ‌న కొనసాగడంతో స‌భ‌ను నాలుగు నిమిషాల్లోనే బుధ‌వారానికి వాయిదా వేశారు.

మ‌రోవైపు రాజ్యస‌భ‌లోనూ అదే సీను కొన‌సాగింది. స‌భ‌ను చైర్మ‌న్ సిపి రాధాకృష్ణ‌న్ ప్రారంభించారు. ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను వినాల‌ని అన్నారు. “పేపర్ లీక్‌లు, నీట్ పరీక్షపై గళం విప్పుతున్న మన విద్యార్థులపై లాఠీచార్జి, బాష్పావాయువు ప్రయోగించి దాడి చేశారు. వారు ఆసుపత్రుల్లో ఉన్నారు. వారి సమస్యలను వినాలి” అని ఖర్గే అన్నారు. దీంతో సభలో అధికార పార్టీ స‌భ్యులు లేచి కేక‌లు వేయ‌డంతో తీవ్ర‌ గందరగోళం నెలకొంది. వెంట‌నే చైర్మ‌న్ సిపి రాధాకృష్ణ‌న్ స‌భ‌ను ఏడు నిమిషాల్లోనే మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లోనూ ప్ర‌తిప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న కొన‌సాగింది. దీంతో చైర్మ‌న్ స‌భ‌ను ఒక్క నిమిషంలోనే మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వాయిదా వేశారు. అనంత‌రం ప్రారంభ‌మైన స‌భ‌లో ప్ర‌తిప‌క్షాలు వెల్‌లోకి వ‌చ్చి ఆందోళ‌న చేప‌ట్టారు. డిప్యూటీ చైర్ హరివంశ్ సింగ్ ఒక్క నిమిషంలోనే స‌భ‌ను బుధ‌వారానికి వాయిదా వేశారు.

​లోక్‌స‌భ స్పీక‌ర్‌తో ప్ర‌తిప‌క్ష నేత‌లు భేటీ

లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాతో ప్ర‌తిప‌క్ష నేత‌లు భేటీ అయ్యారు. లోక్‌స‌భ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాయిదా ప‌డిన త‌రువాత, స్పీక‌ర్ ఓం బిర్లాను ఆయ‌న ఛాంబ‌ర్‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపిలు క‌లిశారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులపై క్రూరత్వంపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరగాల‌ని అన్నారు. అయితే ఈ అంశంపై చర్చించడానికి ప్రభుత్వ అనుమతి కావాలని స్పీకర్ అన్నారని తెలిపారు. విద్యార్థుల నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసులు జరిపిన అణచివేతపై ప్రధానమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.

​ఇండియా బ్లాక్ భేటీ

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో లేవ‌నెత్తే అంశాల గురించి చ‌ర్చించేందుకు ఇండియా బ్లాక్ భేటీ అయింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్‌సిపి (ఎస్‌పి) ఎంపి సుప్రియా సూలే, సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్‌, ఎస్‌పి ఎంపి ధ‌ర్మేంద్ర యాద‌వ్‌, శివ‌సేన ఎంపి సంజ‌య్ రౌత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

​ఎన్‌డిఎ భేటీ

మ‌రోవైపు అధికార ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ భేటీ కూడా జ‌రిగింది. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, ఎన్‌డిఎ ఎంపిలు పాల్గొన్నారు. అనంత‌రం కిరణ్ రిజిజు మాట్లాడుతూ దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ నొక్కిచెప్పార‌ని అన్నారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ తర్వాత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుందని ప్రధాని మోడీ ఎంపిలకు చెప్పారని తెలిపారు. "అంతేకాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యతనిస్తూ, ఫలితాల ప్రకటనలో ఎలాంటి జాప్యం లేకుండా పునఃపరీక్షను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు జరగకుండా నివారించడానికి తీసుకుంటున్న కఠిన చర్యలను కూడా ఆయన వివరించారు. దోషులను శిక్షించాలని, అందరం కలిసికట్టుగా ఒక పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన నొక్కి చెప్పారు" అని రిజిజు అన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్