- కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ప్రకటన
- విస్మయం వ్యక్తం చేస్తున్న నిపుణులు
న్యూఢిల్లీ : ప్రాజెక్టులకు గ్రామసభల నుంచి అనుమతి పొందాలనే నిబంధన ఏదీ కూడా అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ) 2006లో లేదని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, ‘గ్రామసభ ఆమోదానికి సంబంధించిన విషయాలు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి రావు’ అని కూడా తెలిపింది. అటవీ హక్కుల చట్టం అమలు అనేది రాష్ర్టం, లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు చెందిన బాధ్యత అని కూడా తెలిపింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖతో జరిగిన చర్చల్లో ఈ విషయాన్ని వెల్లడించింది.
గ్రామసభ సభ సమ్మతి తీవ్ర ఆటంకం: కేంద్రం
ఎఫ్‌ఆర్‌ఎ కింద గ్రామసభ నుంచి వందశాతం ఆమోదం అనే ‘‘కీలకమైన అడ్డంకి’’ కారణంగా పలు ప్రభుత్వ ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయనే అంశంపై ఈ చర్చలు జరిగాయి. ఆగస్టు 31న విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పిసి)కు పంపిన ఒక అధికారిక సమాచారంలో “షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం 2006 నిబంధనల్లో ప్రాజెక్టులకు అనుమతి కోసం గ్రామసభ సమ్మతిని పొందేందుకు ఎటువంటి నిబంధన లేదు. కాబట్టి ఇటువంటి విషయాలు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి రావు’’ అని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
చట్టం ఏం చెబుతుందంటే?
గిరిజన వ్యవహార మంత్రిత్వ శాఖ ఈ విధంగా పేర్కొనడంపై ఈ రంగానికి చెందిన నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులు అంటే అటవీయేతర ప్రయోజనాల కోసం అటవీ భూమిని మళ్లించడానికి ఎఫ్‌ఆర్‌ఎలో ప్రత్యేకంగా గ్రామసభ అనుమతి అనే పదం లేనప్పటికీ.. అడవుల మళ్లింపును పర్యవేక్షించే ప్రభుత్వ అధికారి ధృవీకరణ పత్రం జారీ చేయడానికి ముందు దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని చట్టంలో స్పష్టంగా ఉంది. అంటే 1980 అటవీ సంరక్షణ చట్టంలోని అన్ని మార్గదర్శకాలను పూర్తి చేయాలి.
అంటే ఉదాహరణకు.. అటవీ హక్కుల లబ్ధిదారుల్ని గుర్తించడం, వారికి వేరే చోట ఈ హక్కులను కల్పించడం, ప్రాజెక్టు కోసం సదరు అటవీ భూమిని మళ్లించడానికి గ్రామసభల నుండి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఒసి) పొందడం... వంటివి తప్పనిసరిగా చేయాలి. అలాగే, అటవీ హక్కుల చట్టం అమలు విషయంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖే బాధ్యత వహిస్తుందని ఈ చట్టం స్పష్టంగా పేర్కొంటుంది.
మంత్రిత్వ శాఖ పరిధిలో కాకుంటే ఏవరి పరిధిలోకి వస్తాయి.
యుపిఎ, ఎన్‌డిఎ ప్రభుత్వాల హయాంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు న్యాయ సలహాదారుగా పనిచేసిన సుప్రీం కోర్టు న్యాయవాది షోమోనా ఖన్నా మాట్లాడుతూ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వైఖరి వింతగా ఉందన్నారు. ‘ఇలాంటి విషయాలు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాకపోతే, మరి ఎవరి పరిధిలోకి వస్తాయి?’ అని ప్రశ్నించారు. కాగా, ఎన్‌హెచ్‌పిసిపై ఒక పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆగస్టు 3న నివేదిక ఇచ్చిన తరువాత కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ- గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నివేదిక ‘నిర్మాణంలో ఉన్న ఎన్‌హెచ్‌పిసి ప్రాజెక్టులకు అటవీ అనుమతి పొందడానికి సగటున 106 నెలల సమయం పడుతోంది, ప్రాజెక్టులకు అవసరమైన అటవీ భూమి మళ్లింపునకు సంబంధిత గ్రామ సభలన్నీ అంగీకరించాలనే నిబంధన ‘‘అత్యంత కీలకమైన అడ్డంకిగా’’ మారింది’ అని పేర్కొంది. అలాగే, ‘‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన భారీ జలవిద్యుత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల’’ కోసం ప్రభావిత గ్రామ సభలలో 70 నుంచి 75 శాతం సమ్మతి సరిపోతుందని కూడా తెలిపింది. గ్రామసభ నుంచి 100 సమ్మతి అవసరం అనేది మంచి ఉద్దేశంతో కూడుకున్నప్పటికీ, ఆచరణలో ఇది కష్టంగా మారిందని, జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుందని నివేదించడం గమనార్హం.






కామెంట్‌లు (0)