- సిపిఎం డిమాండ్
- భారత ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు ఇస్రో అత్యంత కీలకం
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ప్రైవేటీకరించే చర్యలను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం తీవ్రంగా నిరసించింది. తక్షణమే వాటిని ఆపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇస్రో సేవలు భారత్‌కు కీలకం..
రక్షణ, వ్యవసాయ రంగాలకు, విపత్తు నిర్వహణకు, వాతావరణ అంచనాలకు, రిమోట్ సెన్సింగ్‌కు ఇస్రో అందించే సేవలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు వ్యూహాత్మకంగా చాలా కీలకం. అటువంటి కీలకమైన, స్వావలంబన కలిగిన వ్యవస్థను ప్రైవేటీకరించడం వల్ల జాతీయ ప్రాముఖ్యత వంటి అంశాల్లో ప్రైవేటు రంగంపై అనవసరంగా ఆధారపడే పరిస్థితులు తలెత్తుతాయని పొలిట్‌బ్యూరో హెచ్చరించింది. ఇస్రో ఇకపై లాంచ్ వెహికల్స్ తయారుచేయబోదంటూ ఇన్-స్పేస్ ఛైర్‌పర్సన్ పవన్ గోయంకా చేసిన వ్యాఖ్యలు, అంకిత భావం కలిగిన భారత శాస్త్రవేత్తలు గత ఏడు దశాబ్దాల్లో నిర్మించుకుంటూ వచ్చిన రోదసీ పరిశోధనా వ్యవస్థలు, మౌలిక వసతులను ప్రైవేటు రంగ శక్తులకు అప్పగించే నీచపుటెత్తుగడను వెల్లడించాయి. ఈ మార్పు, భారతదేశ రోదసీ విధానంలో భాగమే అని పొలిట్‌బ్యూరో పేర్కొం ది. ఈ విధానం ప్రైవేటు సంస్థలకు మొత్తంగా అంతరిక్ష రంగ ద్వారాలు తెరిచింది, విదేశీ పెట్టుబడులకు ఉదారంగా రాయితీలు ఇవ్వచూపింది. ఇవన్నీ కూడా లాంచ్ ఆపరేషన్లలో ఖర్చును తగ్గించేందుకు అనే మోసపూరితమైన పేరుతో జరుగుతున్నాయని పొలిట్‌బ్యూరో విమర్శించింది. పారదర్శకత లేదా జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు రంగ సంస్థలకు బదిలీ చేయడంపై సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ ఏడాది మార్చిలో సమర్పించిన నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
సిబ్బందికి బాసటగా నిలుస్తాం..
ఇస్రో సిబ్బంది సమాఖ్యల సంయుక్త కార్యాచరణ కమిటీ, ఇస్రో చీఫ్‌కు రాసిన సంయుక్త లేఖ ద్వారా లేవనెత్తిన ఆందోళనలకు స్పందిస్తూ ఇస్రో జారీ చేసిన వివరణ, ఈ విధానాన్ని సమర్ధించేందుకు ప్రయత్నించింది. అయితే, జాతీయ భద్రత విషయంలో రాజీ పడతామనే కీలకమైన ఆందోళనను పరిష్కరించడంలో ఇస్రో వివరణ విఫలమైంది. దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను పరిరక్షించుకోవాలన్నది సిపిఎం వైఖరి, ఇస్రోను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్న శాస్ర్తవేత్తలు, సాంకేతిక నిపుణులు, సిబ్బందికి సిపిఎం బాసటగా నిలుస్తుంది. ఇటువంటి కీలకమైన సంస్థను ప్రైవేటీకరించేందుకు జరిగే అన్ని ప్రయత్నాలను సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పొలిట్‌బ్యూరో ప్రకటన స్పష్టం చేసింది.






కామెంట్‌లు (0)