సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యజమానులను మాత్రమే బాధ్యులను చేయలేం!

1 గంట క్రితం

delhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 01:09 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కార్పొరేషన్‌, వర్శిటీలకూ బాధ్యత వుంది

- ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు

- ఏడుకు పెరిగిన మృతులు, ముగిసిన సహాయక చర్యలు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని సత్యనికేతన్‌లో ఐదంతస్తుల హాస్టల్‌ భవనం కూలిన విషాద ఘటనకు కేవలం భవన యజమానులనే బాధ్యులను చేయలేమని, ఈ విషాదంలో ఢిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌‌కు, ఢిల్లీ యూనివర్శిటీకీ కూడా బాధ్యత వుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అత్యంత దురదృష్టకరమైన ఘటన అని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ యూనివర్శిటీ తగినన్ని హాస్టల్‌ ‌సదుపాయాలు నిర్వహించకపోవడం, విద్యార్ధుల భద్రత గురించి పట్టించుకోకపోవడం, అలాగే పిజిలు, హాస్టళ్ళను నియంత్రించేందుకు ఢిల్లీ కార్పొరేషన్‌, ఇతర అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వంటి అనేక తీవ్ర అంశాలను ఈ ఘటన లేవనెత్తిందని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌డి.కె.ఉపాధ్యాయ, జస్టిస్‌ ‌తేజాస్‌ ‌కరియాలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌ ‌పేర్కొంది. పదిరోజుల్లోగా ఢిల్లీ ప్రభుత్వం, కార్పొరేషన్‌, ఢిల్లీ యూనివర్శిటీ, ఢిల్లీ పోలీసులు వేర్వేరుగా తమ స్పందనలను తెలియచేయాలని బెంచ్‌ ‌కోరింది. భవనం కూలిన ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజనాల పిటిషన్‌‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ కోర్టు అంగీకరించింది.

ఏడుకు చేరిన మృతుల సంఖ్య..

ఈ ఘటనలో మరో ఇద్దరు చనిపోవడంతో మృతి చెందిన వారి సంఖ్య సోమవారం ఉదయానికి ఏడుకు పెరిగింది. కాగా 12మందిని శిధిలాల నుండి రక్షించారు. సోమవారంతో సహాయక చర్యలు ముగిశాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సౌత్‌ ‌జోన్‌ ‌డిప్యూటీ కమిషనర్‌ ‌రాకేష్‌ ‌కుమార్‌‌ను, నలుగురు ఇంజనీర్లను సస్పెండ్‌ ‌చేసినట్లు ఢిల్లీ మేయర్‌ ‌పర్వేష్‌ ‌వహి తెలిపారు. ప్రైవేట్‌ ‌హాస్టల్‌ ‌కూలిన ఘటనలో భవన యజమాని హరిరామ్‌పై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేశారు. హరిరామ్‌ ‌గుప్తా (81), ఆయన భార్య ఊర్మిళా గుప్తా (75), కుమారుడు మహేష్‌ ‌గుప్తా (52)లను రాజస్థాన్‌‌లోని భివాండిలో అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్నారు. మరోపక్క పిజి నిర్వాహకులు, లేబర్‌ ‌కాంట్రాక్టర్‌ ‌కోసం గాలిస్తున్నారు. ఈ కేసులోవారి పాత్రను విచారించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూలిపోయిన భవనానికి ఆనుకుని వున్న భవనాన్ని కూడా కూల్చివేయాలని కార్పొరేషన్‌ ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్