సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మోడీ ఓటమే కమ్యూనిస్టుల విజయం

1 గంట క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 12:41 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

- రైతుల కోసం జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి

- పేదలకు అండదండ ఎర్రజెండా

- సారంపల్లి సంస్మరణ సభలో తెలంగాణ సిఎం రేవంత్‌‌రెడ్డి

- ‘సర్‌’ పేరుతో ప్రజలను విభజిస్తున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌

- సిపిఎం పూర్వ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌‌ కరత్‌

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఓటమే కమ్యూనిస్టుల విజయం అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌‌రెడ్డి అన్నారు. దానికోసం వారు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారని వివరించారు. పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే అని, వారి డిమాండ్లను పరిష్కరించి, చట్టాలు చేసేది కాంగ్రెస్‌‌ పార్టీ అని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు ఏనాడూ ఓట్లు, సీట్లను పట్టించుకోలేదని, వారి లక్ష్యం పేదల పక్షాన నిలవడమే అని అన్నారు. సిపిఎం తెలంగాణ రాష్ర్ట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లోని రవీంద్రభారతిలో ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి జాన్‌‌వెస్లీ అధ్యక్షతన అఖిల భారత కిసాన్‌ ‌సభ జాతీయ ఉపాధ్యక్షులు, సిపిఎం సీనియర్‌ ‌నాయకులు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ సోమవారం జరిగింది. ముఖ్య అతిథులుగా రేవంత్‌‌రెడ్డి, సిపిఎం పూర్వ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌‌ కరత్‌ హాజరయ్యారు. మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. రేవంత్‌‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో కలిసినా, కలవకపోయినా కమ్యూనిస్టుల పోరాటం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడిందన్నారు. అందరం కలసి దేశంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిన్న మొన్నటి వరకు మత రాజకీయాలను నమ్ముకున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌‌లు ఆ తర్వాత సిబిఐ, ఇడి వంటి స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలను వాడుకొని అధికారంలోకి వచ్చేలా కుట్రలు రూపొందించాయని విమర్శించారు. ఇప్పుడు ఆ అంశాలను ప్రజలను పట్టించుకోవట్లేదని గమనించి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేమని గ్రహించి ‘సర్‌’ పేరుతో బిజెపి వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. కేవలం మైనార్టీల ఓట్లను మాత్రమే టార్గెట్‌ ‌చేయట్లేదని, ఎస్‌‌సి, ఎస్‌‌టి ఓట్లను తొలగించే చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారన్నారు. పశ్చిమబెంగాల్ లో చేసినట్టే తెలంగాణలో చేస్తామని బిజెపి నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారని విమర్శించారు. 2014 నుంచి 2023 వరకు వరుస ఎన్నికల్లో బూత్ ల వారీగా ప్రతిపక్షాలకు పోలైన ఓట్లను గమనించి, వాటిని తొలగిస్తున్నారని విమర్శించారు. దీనికోసం ప్రయివేటు ఏజెన్సీలను పెట్టి సర్వేలు చేయించి క్రమపద్ధతిలో ఓట్లు తొలగిస్తున్నారని వివరించారు. రాజ్యాంగబద్ధంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్ ను కూడా బిజెపి రాజకీయాలకు వాడుకుంటోందన్నారు. ‘సర్‌’ ప్రారంభానికి ముందు రాష్ర్ట వ్యాప్తంగా పలు ఆందోళనలు చేసిన ప్రధాన ప్రతిపక్షం (బిఆర్‌ఎస్‌) ఇప్పుడు ఎందుకు ఒక్క మాటకూడా మాట్లాడట్లేదని ప్రశ్నించారు. దీనివెనుక బిజెపి, బిఆర్‌ఎస్‌‌కు ఉన్న అవగాహనను కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాలని కోరారు. ఓటు పేరుతో ఇప్పుడు పేద ప్రజల ప్రాథమిక హక్కులపైనే దాడి మొదలైందన్నారు. కమ్యూనిస్టులు లేవనెత్తిన ప్రతి సమస్యనూ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పరిష్కరించిందని గుర్తుచేశారు. భూమిలేని నిరుపేదలకు కనీస కూలి ఉండాలని కమ్యూనిస్టులు కొట్లాడితే, కాంగ్రెస్‌‌ పార్టీ కనీస వేతన చట్టం తీసుకొచ్చిందని, దున్నేవాడికే భూమి నినాదంతో కమ్యూనిస్టులు పోరాడితే 24 లక్షల 56 వేల ఎకరాల అసైన్డ్ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం పంచిందన్నారు. వాటిలో పది లక్షల ఎకరాలు ఆదివాసీల చేతుల్లో ఉన్నాయని తెలిపారు. గ్రామాల్లో పనులు లేక పేదలు ఇబ్బందులు పడుతుంటే, వారి పక్షాన కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తే, కాంగ్రెస్‌‌ పార్టీ ఉపాధి హామీ చట్టం ద్వారా పని కల్పించిందన్నారు. పేదలు ఆకలితో ఉండొద్దని కమ్యూనిస్టులు గతంలో అంబలి కేంద్రాలు నడిపితే, దాని పరిష్కారానికి కాంగ్రెస్‌ పార్టీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చిందని పేర్కొన్నారు. పేదలకు సొంతిళ్లు కావాలని కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తుంటే, తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను తెచ్చిందన్నారు. కమ్యూనిస్టులు పేదల పక్షాన కొట్లాడతారని, వారికి స్వీయ అజెండాలు ఉండవని పేర్కొన్నారు. పోరాటాల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎర్రజెండా కనిపిస్తే పేదవాడికి ఒక భరోసా వస్తుందని, దేశానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్ర మోడీ అనీ, ఆయన ఓటమే కమ్యూనిస్టుల గెలుపు అని పేర్కొన్నారు. పేద ప్రజల ఓటు హక్కును కమ్యూనిస్టులు కాపాడాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును సిపిఎం రాష్ర్ట కార్యదర్శి జాన్‌‌వెస్లీ సభలో ప్రస్తావించారు. దీనిపై సిఎం స్పందిస్తూ పేదల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. వారి సమస్యలు, పరిష్కారాల విషయంపై తానే స్వయంగా వారితో చర్చిస్తానని సిఎం హామీ ఇచ్చారు.

​ పరిశోధనా కేంద్రానికి సారంపల్లి పేరు : రేవంత్‌ ‌రెడ్డి

మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు వెళ్లి రైతుల కోసం తన జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మరణం రైతాంగానికి తీరని లోటు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రైతాంగ సమస్యపై అవగాహన, సంస్కారవంతంగా అంశాలను లేవనెత్తడంలో ఆయనకు సాటిలేరని ప్రశంసించారు. కౌలు రైతుల సమస్య, పంటలు గిట్టుబాటు ధర కోసం ఆయన ఎంతో పోరాడారని అన్నారు. మల్లారెడ్డి రాసిన పుస్తకాలు, లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతాంగ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. సారంపల్లి మల్లారెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఏదైనా పరిశోధనా కేంద్రానికి ఆయన పేరు పెడతామని, దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

‘సర్‌’తో ప్రజల మధ్య విభజన : ప్రకాశ్‌‌కరత్‌

నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం తొత్తుగా పనిచేస్తోందని సిపిఎం పూర్త ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌‌ కరత్‌ అన్నారు. ‘సర్‌’ పేరుతో దేశంలో మూడో వంతు ఓటర్లను తొలగించే కుట్రలు జరుగుతున్నాయని వివరించారు. దీనివల్ల మైనార్టీలు, మెజారిటీ తరగతుల ప్రజలు అని కాకుండా, ఓటు హక్కు ఉన్నవారు, అది లేనివారు అనే రెండు రకాల ప్రజా విభజన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌‌పరివార్‌ ‌దేశంలో ప్రజాస్వామ్యం, సెక్యులరిజంను సవాలు చేస్తున్నాయన్నారు. జనగణనను మతపరమైన విభజనకు వాడుకొనే కుట్రలు చేస్తున్నారని వివరించారు. తెలంగాణలో 92 లక్షల ఓట్ల తొలగింపు చేపట్టారని, వయోజన ఓటు హక్కు ప్రమాదంలో పడిందని హెచ్చరించారు. బెంగాల్‌‌లో కూడా లక్షల మంది ఓట్లు తొలగించారని, వాటిలో ముస్లిం మైనార్టీలను టార్గెట్‌ ‌చేశారని వివరించారు. ఢిల్లీలోనూ 33 శాతం ఓట్లు గల్లంతు చేశారని గుర్తు చేశారు. ‘సర్‌’ పేరుతో ఓ ప్రత్యేక సెక్షన్‌ ‌ప్రజలను టార్గెట్‌ ‌చేస్తున్నారన్నారు. ఓటుహక్కు తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని, మోడీ సర్కార్‌ ‌దాన్నే చేస్తోందని తెలిపారు. తెలుగు రాష్ర్టాల్లో సారంపల్లి మల్లారెడ్డి స్ఫూర్తివంతమైన నాయకుడు అని కొనియాడారు. ఆయనకు భారతీయ వ్యవసాయ విధానం పట్ల సంపూర్ణ అవగాహన ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, సోషలిజం వర్థిల్లాలని ఆయన చివరి వరకు కాంక్షించారని వివరించారు. రైతాంగ సమస్యలపై వారిని మేల్కొలిపి, పరిష్కారాల కోసం దిక్సూచిగా నిలిచారని, ఆయన జీవితం ఆదర్శవంతమని ప్రశంసించారు.

రైతాంగ ఉద్యమాలకు మార్గదర్శి : వి శ్రీనివాసరావు

మల్లారెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి నాయకుడని సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఆయనకు ఆదిలాబాద్‌ ‌నుంచి అనంతపురం, శ్రీకాకుళం నుంచి మహబూబ్‌‌నగర్‌ ‌వరకు అవగాహన ఉందని తెలిపారు. కమ్యూనిస్టులకు పోరాటం, అధికారం రెండూ కావాలని, శ్రామికులు, కూలీలంతా కమ్యూనిస్టులేనని పేర్కొన్నారు. అమెరికా గడ్డ మీద కూడా సోషలిస్ట్‌ ‌పోరాటాలు ముందుకొస్తున్నాయని, దేశంలో మోడీ పాలనకు సమాధి కట్టే పరిస్థితి వస్తోందని వివరించారు. మతోన్మాద, కార్పొరేట్‌ ‌విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా ఉద్యమిస్తే విజయం తథ్యమని తెలిపారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల నిర్మాణంలో సారంపల్లి మల్లారెడ్డి దిట్ట అని కొనియాడారు. జీవించి ఉన్నంత వరకూ రైతులు, పేదలు, కార్మికుల పక్షాన పనిచేశారని ప్రశంసించారు.

‘నా నాగేటి సాళ్లు’ పుస్తకావిష్కరణ

సారంపల్లి మల్లారెడ్డి స్వీయ రచన ‘నా నాగేటి సాళ్లు’ పుస్తకాన్ని ప్రకాష్‌‌ కరత్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఎస్‌ ‌వీరయ్య, జ్యోతి, మంత్రి మహ్మద్‌ అజారుద్దీన్‌, ఎమ్మెల్యే మదన్‌‌సింగ్‌ ఠాకూర్‌, సిపిఐ (ఎంఎల్‌) ‌మాస్‌‌లైన్‌ ‌రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్‌, సిపిఐ (ఎంఎల్‌) ‌న్యూమెమోక్రసీ, ఎస్‌‌యుసిఐ (యు), సిపిఐఎంఎల్‌ ‌లిబరేషన్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్