చండీగఢ్ : పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్‌పియు)లో విద్యార్థులు ఆదివారం తెల్లవారుజామున ఆందోళనకు దిగారు. ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందంటూ సోషల్‌మీడియాలో ప్రచారమైన వార్తల నేపథ్యంలో ఈ నిరసన చేపట్టారు.ఆందోళన సందర్భంగా క్యాంపస్‌లోని కిటికీలు,పూలకుండీలను ధ్వంసం చేయడంతోపాటు కొన్ని వస్తువులకు నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు.అనంతరం జలంధర్-ఫగ్వారా జాతీయ రహదారిని కూడా దిగ్బంధించారు. మూడు రోజుల క్రితం జి3హాస్టల్‌కు చెందిన ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో అర్ధరాత్రి సుమారు2గంటల సమయంలో విద్యార్థులు యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై ఆందోళనకారులు చేసిన ఆరోపణల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని జలంధర్ రేంజ్ డీఐజీ నవీన్ సింగ్లా వెల్లడించారు.ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఫోరెన్సిక్ ఆధారాలు,సీసీటీవీ ఫుటేజ్,ఫోన్ డేటాను పరిశీలిస్తున్నామని చెప్పారు.
అయితే అత్యాచారం జరిగినట్లు తమకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని కపుర్తలా ఎస్‌ఎస్‌పి గౌరవ్ తూరా తెలిపారు.విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నామని,వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని,ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నామని తెలిపారు. ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థినులు మృతిచెందారంటూ ధ్రువీకరించని వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వార్తపై ఆగ్రహించిన విద్యార్థులు ఒక పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం.అయితే ఈ మరణాలపై అధికారిక ధ్రువీకరణ లేదు.
పాటియాలలోని చిత్కారా యూనివర్సిటీ విద్యార్థులు నిరసన చేపట్టిన మరుసటి రోజే ఎల్‌పియులో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.







కామెంట్‌లు (0)