న్యూఢిల్లీ : విద్యార్థినుల హాస్టల్ వసతి కొరతపై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఆదివారం ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యపై ప్రధాని మోడీ వివరణనివ్వాలని ఆయన కోరారు. దీపాలు వెలిగించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది కానీ, మా హాస్టళ్లకు ఎందుకు డబ్బులేదని శనివారం ఇండోర్‌లో జరిగిన ‘విద్యార్థుల గళం’ కార్యక్రమంలో ఒక విద్యార్థిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను రాహుల్‌గాంధీ ప్రస్తావించారు. "అక్కడ హాస్టల్ లేదు, అందుకే ఆ విద్యార్థిని పీజీలో ఉండాల్సి వస్తోంది. కేవలం సురక్షితంగా ఉండటం కోసమే లక్షలు ఖర్చు చేస్తున్నారు. నెలకు చెల్లించాల్సిన అద్దె గురించిన ఆందోళన, నిరాశ్రయురాలవుతామనే భయం - వీటన్నిటి మధ్య ఆమె చదువుకోవాల్సి వస్తోంది," అని రాహుల్‌గాంధీ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కేవలం హాస్టల్ వసతి లేకనే చాలా మంది బాలికలు తమ చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని అన్నారు. ఆ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మీదగ్గర సమాధానం ఉందా అని ప్రధాని మోడీని నిలదీశారు. ఇక ఇంటి అద్దె భత్యం (హౌసింగ్ అలవెన్స్) సంగతేంటని ప్రధాని మోడీని నిలదీశారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా అది పెరగదని, పైగా అది అవినీతికి బలైపోతోందని అన్నారు.
"పిఆర్ కార్యక్రమాలు. డిజైనర్ దుస్తులు. విలాసవంతమైన కార్లు. విమానాలు. చర్మ సంరక్షణ. భారతదేశ యువత విద్య తప్ప మిగతా అన్నింటికీ ప్రధాని దగ్గర డబ్బు ఉంది అని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం ప్రతినిధి పవన్‌ఖేరా విమర్శించారు. మౌలిక సదుపాయాలు లేవని, నాణ్యమైన ఉపాధ్యాయులు లేరని, శిక్షణ లేదని, హాస్టళ్లు, ఉద్యోగాలు లేవని అన్నారు. ఈ సమయంలో ఆయన డిగ్రీ ప్రామాణికత అప్రస్తుతమని, విద్య పట్ల ఆయనకున్న ధిక్కార భావమే, ఆయన ఎంతటి 'విద్యావంతుడో' వివరిస్తుందని పవన్ ఖేరా విమర్శించారు.







కామెంట్‌లు (0)