జైపూర్ : ప్రధానిమోడీ పుట్టినరోజు వేడుకలను ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించడంపై రాజస్థాన్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్, పౌరహక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రధాని పుట్టినరోజు వేడుకల్లో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ-ప్రైవేటు విద్యాసంస్థలను భాగస్వామ్యం చేయడమెందుకని కాంగ్రెస్ ప్రశ్నించింది. నెల రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా కళాశాల విద్యార్థులతో దీపాలు వెలిగించడం, సామాజిక సేవా కార్యక్రమాలు, ఇన్నోవేషన్ పోటీలు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. నెల రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మొత్తం 12 రకాల కార్యక్రమాలను నిర్వహించాలని, అనంతరం వాటి నివేదికలను సమర్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17న విద్యార్థులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ప్రజలు దీపాలు వెలిగించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కార్యక్రమాల వివరాలు, ఫొటోలు, వీడియోలను ప్రత్యేక పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కూడా సూచించారు. సాయంత్రం ఆలస్యం అవుతోందని, అక్కడ ఉండలేమని జైపూర్‌లోని కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో మహిళా ఉపాధ్యాయులు చెప్పడంతో, దీపాలు వెలిగించే కార్యక్రమం కోసం పురుష సిబ్బందిని అక్కడే ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. రాజస్థాన్ సహా పలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇదే తరహా ఆదేశాలను జారీచేసినట్లు సమాచారం.
అయితే, ప్రధాని పుట్టినరోజును అధికారికంగా నిర్వహిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని, విద్యాసంస్థలను అందులో భాగస్వామ్యం చేయడంపై కాంగ్రెస్ నేత టీకా రామ్ జుల్లీ ప్రశ్నించారు. సామాన్య ప్రజలు, బలహీన వర్గాలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్లిష్ట పరిస్థితులతో సతమతమవుతున్నప్పటికీ, పాలక పార్టీ బిజెపి ఇటువంటి ఆర్భాటపు కార్యక్రమాల ద్వారా తన భారీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. విద్యాసంస్థలు విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన, విమర్శనాత్మక దృక్పథాన్ని పెంపొందించాల్సి ఉండగా, రాజకీయ నాయకుడి పుట్టినరోజు వేడుకల్లో వారిని భాగస్వామ్యం చేయడం సముచితం కాదని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పియుసిఎల్) సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రధాని మోడీ పుట్టినరోజును అధికారికంగా జరుపుకోవడం ద్వారా బిజెపి ప్రభుత్వం భజనలో అన్ని హద్దులు దాటిందని విమర్శించింది. జీవించి ఉన్న రాజకీయ నేత పుట్టిన రోజును అధికారికంగా నిర్వహించాలని ఆదేశించడం, భూస్వామ్య యుగం నాటి విధానమని, విద్యార్థులను తిరోగమన దిశగా తీసుకువెళుతున్నారని పియుసిఎల్ జాతీయ అధ్యక్షురాలు కవితా శ్రీవాస్తవ విమర్శించారు. విద్యార్థులలో విమర్శనాత్మక దృక్పథాన్ని పెంపొందించడానికి బదులుగా వారిని "విధేయులుగా" మారుస్తోందని పియుసిఎల్ రాష్ట్ర అధ్యక్షుడు అనంత్ భట్నాగర్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వును "నిరంకుశమైనది"గా అభివర్ణించిన ఆయన, విద్యార్థుల స్వతంత్ర ఆలోచనా విధానాన్ని అణచివేసే ఇటువంటి ప్రయత్నాలను మానుకోవాలని అన్నారు.








కామెంట్‌లు (0)