- రాజ్యాంగ విరుద్ధం : ఐఎఫ్‌ఎఫ్
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల ఆందోళనల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో విద్యార్థులు పెట్టిన పోస్టులను ఢిల్లీ పోలీసులు తొలగించడాన్ని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఐఎఫ్‌ఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఇలా తొలగించడం "రాజ్యాంగ విరుద్ధం" అని విమర్శించింది. ఈ మేరకు మంగళవారం ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ‘ప్రశ్నించే విద్యార్థులు తమ ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్నారు, వారి పోస్టులను తొలగించడం వల్ల వారి ప్రశ్నలు తొలగిపోవు’ అని ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వాల నుంచి వచ్చే చట్టపరంకానీ అభ్యర్థనలను తిరస్కరించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కోరింది. ప్రధానమంత్రి మోడీపై అభ్యంతరకరంగా ఉన్న పోస్టులు, వీడియోలు, మీమ్స్, రీల్స్‌ను తొలగించాలని ఢిల్లీ పోలీసులు కనీసం మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించినట్లు తమ దృష్టికి వచ్చిందని, దీని ప్రకారం ఇప్పటికే అనేక పోస్టులను తొలగించారని ఐఎఫ్‌ఎఫ్ తన ప్రకటనలో తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం, కేవలం ఎనిమిది నిర్దిష్ట కారణాలపై మాత్రమే భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు ఉన్నాయని, అభ్యంతరకరంగా ఉండటం వాటిలో ఒకటి కాదని ఐఎఫ్‌ఎఫ్ గుర్తు చేసింది. నిజానికి నిబంధనల్లో వాడిన పదాలు అస్పష్టంగా ఉన్నాయనే కారణంతో ఐటి చట్టంలోని సెక్షన్ 66Aను 2015లోనే సుప్రీం కోర్టు కొట్టివేసిందని, 11 ఏళ్ల తర్వాత కూడా ఢిల్లీ పోలీసులు ఈ సెక్షన్‌ను వర్తింపజేస్తున్నారని విమర్శించింది. బిఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 356 ప్రకారం పరువు నష్టం కారణంగా ఈ పోస్టులను తొలగిస్తున్నారని అనుకున్నా, ఈ చట్టం ప్రకారం బాధితుడు స్వయంగా ఫిర్యాదు చేయాలని ఐఎఫ్‌ఎఫ్ గుర్తు చేసింది. ఈ ప్రకటనలో, ఢిల్లీ పోలీసులు జారీ చేసిన ప్రతి నోటీసును బహిరంగ పర్చాలని ఐఎఫ్‌ఎఫ్ డిమాండ్ చేసింది. అభ్యంతకర పోస్టులు చేశారనే ఆరోపణలతో వ్యక్తులపై ఎలాంటి క్రిమినల్ విచారణ జరపకూడదని విజ్క్షప్తి చేసింది.








కామెంట్‌లు (0)