న్యూఢిల్లీ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్) ఉన్న రష్యన్ వ్యోమగాములు భారత దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ త్రివర్ణ పతాకాన్ని చేబూని, ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్–రష్యా మధ్య ఉన్న సుదీర్ఘ అంతరిక్ష సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘ప్రియమైన స్నేహితులారా.. నేడు గణతంత్ర భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది’’ అని ప్యోటర్ డుబ్రోవ్ పేర్కొన్నారు. భారత ప్రజలకు శాంతి , శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. మానవ అంతరిక్ష ప్రయాణంలో కీలక ఘట్టమైన సోవియట్ వ్యోమగామి యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లి 65 ఏళ్లు పూర్తవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. యూరీ గగారిన్ 1961 నవంబర్‌లో భారత్‌ను సందర్శించారు. ఆ సమయంలో భారత్, సోవియట్ యూనియన్ మధ్య బలపడుతున్న స్నేహానికి ఆయన ఒక ప్రతీకగా నిలిచారు. అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎంతో అందంగా కనిపించిందని, అయితే భూమిపైకి వచ్చాక అది మరింత అందంగా ఉందని, ఎందుకంటే ఇక్కడ నిజమైన స్నేహితులు ఉన్నారని గగారిన్ చెప్పిన మాటలను రష్యా వ్యోమగాములు గుర్తుచేశారు. భారత్–రష్యా అంతరిక్ష సహకారం 1975లో భారత తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను సోవియట్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపడంతో ప్రారంభమైంది. ఆ తర్వాత 1984లో రాకేష్ శర్మ సోవియట్ అంతరిక్ష నౌక ‘సోయుజ్ టీ-11’లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఈ ఘనత రెండు దేశాల మధ్య అంతరిక్ష సంబంధాలను మరింత బలోపేతం చేసింది. ప్రస్తుతం భారత్ చేపట్టిన ‘గగన్‌యాన్’ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమంతో ఈ భాగస్వామ్యం కొత్త దశలోకి ప్రవేశించిందని రష్యా వ్యోమగామి అన్నా కికీనా పేర్కొన్నారు.
గగన్‌యాన్ మిషన్‌కు ఎంపికైన భారతీయ వ్యోమగాములు ‘గగన్‌యాత్రులు’గా పిలుస్తున్నారు. వీరికి రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో శిక్షణ కూడా అందించారు. అంతరిక్ష సహకారాన్ని గుర్తుచేసుకుంటూ రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్, భారత్‌లోని దాని కార్యాలయం, ఇస్రో కలిసి నిర్వహించిన పోటీని కూడా వ్యోమగాములు ప్రస్తావించారు. ఆ పోటీలో విజేతలుగా నిలిచిన వారి చిత్రాలను స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల సందేశాలతో పాటు అంతరిక్ష కేంద్రంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా “భారత్–రష్యా స్నేహం వర్ధిల్లాలి” అని మరో రష్యా వ్యోమగామి ఆండ్రే ఫెద్యాయెవ్ ఆకాంక్షించారు.








కామెంట్‌లు (0)