ఒరిస్సాలో విస్తుపోయే ట్రాఫిక్ చలానాలు
కాగ్ నివేదికలో వెల్లడి
భువనేశ్వర్ : సీటు బెల్ట్‌లు ధరించనందుకు టూ వీలర్స్ నడుపుతున్న వారికి జరిమానాలు, హెల్మెట్లు ధరించనందుకు కార్లు, ఆటోలు ఇతర వాహనదారులకు ఫైన్...ఇది చూస్తుంటే వింతగా అనిపిస్తోంది కదా! నిజమే ఒరిస్సాలో అత్యంత దారుణంగా, వింతగా వున్న ట్రాఫిక్ చలానాల పరిస్థితి ఇది. ఈ నెల 28న ఒరిస్సా అసెంబ్లీకి అందచేసిన కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో విస్తుపోయే ఈ విషయాలు బయటపడ్డాయి. పైగా 60వేల టన్నులకు పైగా వ్యర్ధాలను మోటార్‌సైకిళ్ళు, ఇతర వాహనాలను ఉపయోగించి తరలించినట్లు నమోదు చేశారు. సీటు బెల్ట్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు2,988మంది టూ వీలర్స్‌కు జరిమానాలు విధించామని ఆడిట్ నివేదిక పేర్కొంది. అలాగే హెల్మెట్ ఉల్లంఘనలకు పాల్పడిన 4,786మంది త్రి చక్ర, నాలుగు చక్రాల వాహనదారులకు చలానాలు జారీ చేశారు. అంతకంటే ఆశ్చర్యకరమైన అంశమేమంటే రెండు మోటార్‌సైకిళ్ళు, ఇ-రిక్షా, కారు, అసలు ఉనికిలోనే లేని ఒక వాహనం ద్వారా రూర్కెలాకు ఏకండా 60,508 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలను తరలించినట్లు కూడా ఆ నివేదిక కనుగొంది. ఈ మొత్తం వ్యవహారంలో అనేక లొసుగులు, లోపాలను కాగ్ కనుగొంది, రికార్డులు ప్రశ్నించేలా వున్నాయని పేర్కొంది. పైగా ఒరిస్సా ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ప్రభుత్వ నిధులు పెద్ద మొత్తంలో దుర్వినియోగం చేసిన సంఘటనలను పేర్కొంది. తప్పుడు ఇ చలాన్లాను రద్దు చేయాలని కాగ్ సిఫార్సు చేసింది. తప్పుడు సెక్షన్ల కింద ఆదేశాలు జారీ చేసిన అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కాగ్ కోరింది. ఇదంతా చూస్తుంటే అధికారులు నేరాలు నమోదు చేసే సమయంలో చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని తెలుస్తోందని కాగ్ పేర్కొంది.







కామెంట్‌లు (0)