ఇటీవల నోయిడాలో కార్మికుల పోరాటం, దానిపై రాజ్య యంత్రాంగం ప్రయోగించిన నిర్బంధం మనం చూశాం. ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదు. సమస్త ఖండాలలోనూ, వివిధ దేశాలలోనూ విస్తరిస్తున్న బహుళరూప శ్రామిక అశాంతికి ఇది ఒక నిదర్శనం. భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా పెట్టుబడిదారీ పీడనకు వ్యతిరేకంగా శ్రామిక వర్గం పోరాడుతోంది. ఇదే క్రమంలో భారతీయ కార్మిక వర్గం కూడా డిసెంబరు 1,2,3 తేదీలలో మరో సమరశీల పోరాటానికి సన్నద్ధమవుతోంది.
ద్యోగ భద్రత, వేతనాల పెంపు, కాంట్రాక్టీకరణ రద్దు, సామాజిక భద్రతా పెన్షన్లు వంటి ప్రాథమిక హక్కుల సాధనే లక్ష్యంగా ఈ పోరాటాలు సాగుతున్నాయి. ఇటీవల వివిధ ఖండాలలో జరిగిన సమ్మెలను పరిశీలిస్తే... ప్రాంతం మారినా, భాష మారినా శ్రామికులందరినీ వేధిస్తున్న అంతర్లీన శత్రువు ఒక్కటేనని స్పష్టమవుతుంది.
వివిధ దేశాల్లో ఉద్యమ జ్వాలలు
గురుగ్రామ్ మునిసిపల్ కార్పొరేషన్‌లో పని చేస్తున్న వేలాది మంది పారిశుధ్య కార్మికులు ఆగస్టు 10 నుండి 15 వరకు వీరోచిత సమ్మె చేశారు. న్యూఢిల్లీలో పారిశుధ్య కార్మికులు ఆగస్టు 4న జంతర్ మంతర్ వద్ద గళమెత్తారు. చేత్తో సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే అమానుష పద్ధతికి తక్షణమే ముగింపు పలకాలనేది ప్రధాన డిమాండ్లలో ఒకటి.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో విక్టోరియా ప్రభుత్వ సిబ్బంది ఆగస్టు 11న సమ్మె బాట పట్టారు. మెరుగైన పని పరిస్థితులను కల్పించాలని, నాలుగేళ్లలో 38.18 శాతం వేతన పెంపు చేయాలని డిమాండ్ చేస్తూ లేబర్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డెక్కారు. అమెరికాలో న్యూయార్క్ ప్రాంతంలో సుమారు 30 ఏళ్ల తర్వాత మే 16 నుండి మే 18 వరకు మూడు రోజుల పాటు శాన్‌ఫ్రాన్సిస్కో ఉపాధ్యాయులు సమ్మె చేశారు. మొరాకోలో న్యాయవాదులు, నార్వేలో ఆతిథ్య రంగ కార్మికులు ఇటీవలే సమ్మెలు చేశారు. కామెరూన్ లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు తమ బకాయి వేతనాలను విడుదల చేయాలని, సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2026లో సమ్మె ప్రారంభించారు. అర్జెంటీనా అధ్యక్షుడు మిలీ ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక డిక్రీకి నిరసనగా ఆగస్టు 15న ఓడరేవుల డాక్ వర్కర్లు మెరుపు సమ్మె చేపట్టారు. జర్మనీలో ఫోక్స్‌వాగన్ గ్రూప్ కు చెందిన ఆడి ప్లాంట్ మూసివేతపై ఆగస్టు 29న దాదాపు ఆరువేల మంది కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు. స్పెయిన్ లోని బార్సిలోనాలో క్షీణిస్తున్న పని పరిస్థితులు, భద్రతా ప్రమాణాల లేమికి నిరసనగా ఆగస్టు 4 నుండి విమానాశ్రయ గ్రౌండ్ ఆపరేషన్స్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ఫ్రాన్స్ లో రైల్వే డ్రైవర్లు, కండక్టర్లు మూడు రోజుల సమ్మె నిర్వహించారు.
ఈ పోరాటాలన్నింటి వెనుక ఉన్న అసలు సూత్రధారులు-నయా ఉదారవాద ఆర్థిక విధానాలే. ఈ విధానాలు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్లు లాభాలను పిండుకోవడానికి, శ్రామికుల రక్తాన్ని ధారపోస్తున్నాయి. ఫలితంగా పెట్టుబడిదారీ స్వర్గధామంగా ప్రచారమయ్యే అమెరికాలోనే వేతన అసమానతలు పరాకాష్టకు చేరాయి.
పెరుగుతున్న వేతన వ్యత్యాసాలు
యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఎన్విడియా, మెటా వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘ఎస్ అండ్ పి 500’ దిగ్గజ కంపెనీలలో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు (సిఇఓ)-కార్మికుల వేతన నిష్పత్తి 2024లో 285:1 నుండి 2025లో 312:1 కి పెరిగిందని ఎగ్జిక్యూటివ్ పే వాచ్ నివేదిక చెప్తోంది. అంటే ఒక సిఇఓ ఒక్క రోజులో సంపాదించేది, సగటు అమెరికన్ కార్మికుడు ఏడాది పొడవునా రెక్కలు ముక్కలు చేసుకున్నా పొందలేకపోతున్నాడు.
భారత దేశంలో ఈ వేతన వ్యత్యాసాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు బాగా వేతనాలుంటాయని చెప్పే ఐ.టి రంగానికి చెందిన ఇన్ఫోసిస్ కంపెనీలో సిఇఓ వార్షిక వేతనం 80.6 కోట్ల రూపాయలు ఉండగా, ఉద్యోగి సగటు జీతం 10.72 లక్షల రూపాయలు. అంటే సిఇఓ, వేతనం సాధారణ ఉద్యోగి కంటే 752 రెట్లు ఎక్కువ. ఈ తక్కువ వేతనాల ప్రభావం శ్రామిక కుటుంబాల ఆహార వినియోగంపైన, వారి ఆరోగ్యంపైన ప్రత్యక్షంగా వుంటోంది.
ఆకలి కోరల్లో సగానికి పైగా శ్రామికలోకం
వేతనాల క్షీణత నేరుగా శ్రామిక కుటుంబాల పౌష్టికాహారంపై, ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఐక్యరాజ్యసమితి ''ఆహార భద్రత - పోషకాహార నివేదిక'' వెల్లడించిన వాస్తవాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ప్రపంచంలోని 269 కోట్ల ప్రజలు (ప్రపంచ జనాభాలో 32.7 శాతం మంది) అంటే ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు.
ఐదేళ్ల లోపు వయస్సు కలిగిన 15 కోట్ల మంది పిల్లలు ప్రొటీన్లు, అవసరమైన కొవ్వు, ఆమ్లాలు, ఇనుము, జింక్, విటమిన్ 'ఎ' కొరత వల్ల ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. 15 నుండి 49 సంవత్సరాల వయస్సుగల మహిళల్లో రక్తహీనత దాదాపు అన్ని ప్రాంతాలలో పెరుగుతోంది.
భారతదేశంలో ఐదేళ్ల లోపు పిల్లలలో 35.5 శాతం మంది పిల్లలు తీవ్రమైన పౌష్టికాహార లేమి, ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. 32.1 శాతం మంది పిల్లలు తక్కువ బరువును కలిగి ఉన్నారు. దేశంలోని 6 నెలల నుండి 5 ఏళ్ల లోపు పిల్లలలో 67.1 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 15-49 ఏళ్ల వయస్సులోని 57 శాతం మంది మహిళలు, గర్భిణులలో 52.2 శాతం మంది ఇనుము, సూక్ష్మ పోషకాల లోపం వల్ల రక్తహీనతకు గురవుతున్నారు.
విశేషమేమిటంటే ఒకవైపు కోట్లాది మంది ప్రజలు ఆకలితో, పౌష్టికాహార లోపంతో అలమటిస్తుంటే...మరోవైపు ప్రపంచ దేశాలు యుద్ధ సమీకరణాల కోసం చేసే సైనిక వ్యయం మాత్రం రికార్డు స్థాయికి చేరుతోంది.
జీవించే హక్కు-యుద్ధోన్మాదం
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) నివేదిక ప్రకారం, ప్రపంచ సైనిక వ్యయం 2025లో రికార్డు స్థాయిలో 2,88,700 కోట్ల డాలర్లకు చేరుకుంది. అమెరికా ఒక్కటే 95,400 కోట్ల డాలర్లు ఖర్చు చేయగా, నాటో సభ్య దేశాలు కలిసి 1,581,09 కోట్ల డాలర్లు ఖర్చు చేశాయి. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక సైనిక వ్యయం చేసే దేశాల జాబితాలో భారతదేశం నాల్గవ స్థానంలో ఉంది.
సామ్రాజ్యవాదం తన ఆర్థిక ప్రయోజనాల కోసం సృష్టించే యుద్ధాలు, ఇరుగు పొరుగు దేశాల మధ్య ఘర్షణల వల్ల దేశ సంపదలు నాశనమైపోవడమే కాక, సామాన్య ప్రజలు చనిపోతున్నారు. ప్రపంచ వ్యాపితంగా సైనిక వ్యయం పదో వంతు ఖర్చుతో తీవ్ర పేదరికాన్ని సమూలంగా నిర్మూలించవచ్చు. కానీ, ఆ పని చేయకుండా ఒక పక్క యుద్ధాలు, ఘర్షణలతోనూ, మరోపక్క ఆకలితోనూ శ్రామికుల ప్రాణాలు తీస్తున్నారు. పాలకులకు ప్రజా సంక్షేమం కంటే కార్పొరేట్ లాభాలే ముఖ్యం అన్నది దీన్నిబట్టే తెలుస్తోంది.
ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని పక్కదారులు పట్టించడానికి, వివిధ దేశాలలో పాలకవర్గాలు మితవాద శక్తులను ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలో మతోన్మాద రూపంలో అది వ్యక్తమవుతోంది.
సోషలిస్టు వెలుగు రేఖలు
ఈ పెట్టుబడిదారీ కార్పొరేట్ అంధకారానికి భిన్నంగా చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా వంటి సోషలిస్టు దేశాలు మానవీయ, ప్రజానుకూల విధానాలతో మెరుగైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయి. చైనాలో ప్రైవేటు/లిస్టెడ్ కంపెనీల్లో సిఇఓ-సాధారణ కార్మికుడి వేతన నిష్పత్తి 50:1 దాటనివ్వరు. ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇది కేవలం 10:1 గా మాత్రమే ఉంటుంది. ప్రపంచ బ్యాంక్ ప్రమాణాల ప్రకారం చైనా తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించింది. ప్రజారోగ్యం, విద్య, సామాజిక భద్రతలో సోషలిస్ట్ దేశాలు అగ్రగామిగా ఉండి, శ్రామికులకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను కల్పిస్తున్నాయి. అమెరికా విధించిన ఆంక్షలను కూడా తట్టుకుంటూ క్యూబా తమ దేశ ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యం అందించడమే కాక, ప్రపంచంలోని అనేక దేశాలకు వైద్య సహాయం అందిస్తోంది.
నేటి నయా ఉదారవాద వ్యవస్థ ''కొద్దిమంది కార్పొరేట్లకు కుప్పలు తెప్పలుగా సంపదను సమకూరుస్తూ, కోట్లాది మంది శ్రామికులకు కోలుకోలేని సంక్షోభాన్ని'' మిగులుస్తోంది. శ్రామిక వర్గ జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా, మానవాళిని ఆకలి-యుద్ధాల కోరల నుండి కాపాడుకోవాలన్నా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని నిలదీయాలి. నయా ఉదారవాద దోపిడీ విధానాలను తిప్పికొట్టి...ప్రజానుకూల, సోషలిస్టు తరహా ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను అమలు చేసేలా పాలకులపై ఒత్తిడిని తీసుకురావడమే నేటి కార్మిక వర్గం ముందున్న ఏకైక మార్గం.

వ్యాసకర్త -ఎ. అజ శర్మ
సెల్ 9490098790







కామెంట్‌లు (0)