గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచర్చికి పోతే డిక్లరేషన్‌?

1 గంట క్రితం

maha church.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 05:10 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

‘వందేమాతరమంటూ నినదించిన బంగాళం.. హింసకు ప్రతిహింస అన్న వీరభూమి పాంచాలం.. స్వరాజ్యం జన్మహక్కు అని చాటిన మహారాష్ర్టం’ అంటాడు ఆరుద్ర అల్లూరి సీతారామరాజు గీతంలో. అది వైవిధ్యభరిత భారతదేశ పోరాట స్ఫూర్తికీ నిదర్శనం. కానీ అందులో ప్రతిదానికి చేటు తెస్తున్న ఘనత బిజెపి, ఆరెస్సెస్‌ ‌పరివార్‌‌కే దక్కుతుంది. అందులోనూ నాగపూర్‌ ‌వారి కేంద్రం. ఈ మధ్యనే మహారాష్ట్రలో వారి ప్రభుత్వం మత మార్పిడి నిరోధ చట్టమంటూ తెచ్చింది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధమైన చట్టమిది. అదలా వుంచితే ఈ చట్టం వచ్చాక చర్చిలలో ప్రార్థనల కోసం వెళ్లే వారికి కొత్త సమస్య మొదలైంది. ప్రార్థన ప్రారంభించే ముందు మేము ఇష్టపూర్వకంగానే మతం మార్చుకున్నామని డిక్లరేషన్‌ ఇవ్వాలట. బలవంతం లేదని చెబితేగానీ ప్రార్థన చేయకూడదట. ఇది చట్టం లేదు అంటున్నా చర్చిల నిర్వాహకులను భయపెట్టడం వల్ల వారి జాగ్రత్తలో వారుంటున్నారు. బిబిసి ఈ కథనాన్ని ప్రపంచమంతా ఇవ్వడంతో భారత దేశంలో మత సంబంధాలు, అసహనం ఈ స్థాయికి చేరాయా అని అందరూ ఆశ్చర్యపోతున్నారట. మేము నాలుగో తరంలో, మూడో తరంలో క్రైస్తవులుగా వున్నాం. మేం ఇలా ప్రకటన ఇవ్వడమేమిటని బిబిసి విలేకరి ప్రశ్నలకు సమాధానంగా చాలా మంది చెప్పారట. మతం మార్చుకోకున్నా హిందువులో, ముస్లింలో ప్రార్థన చేసుకోకూడదా. వారేం ప్రకటన ఇవ్వాలి? కడప దగ్గర దర్గాకు దేశంలో అన్ని మతాల సెలబ్రిటీలు వచ్చి పార్థనలు చేసి వెళతారే మరి? అసలు అన్య మతస్తులు అనే మాట విచ్చలవిడిగా వాడుతున్నప్పుడు ఎవరు అన్యం ఎవరు స్వంతం అని ప్రశ్న రాదా? ఎవరి పూజ వారిది. దానికీ ప్రకటనలేంటి? పూల వన్నె వేరు పూజ ఒకటె, దర్శనమ్ములు వేరు దైవంబు ఒకటయా అని వేమన చెప్పింది వీరికి తెలిసేనా?

ఓకె సిఇవో సర్‌! మరి సగం సగం...?

కంపెనీలు, వాటి యజమానులు ఎంత మంచివారైనా తమ లాభం కోసం బాగా పని చేయించుకోవడం కీలకం. అందుకోసం ఎన్నెన్నో చెబుతుంటారు. వరుస మెసేజ్‌‌లు గుప్పిస్తుంటారు. నిజానికి ఉద్యోగులు ఇంకా లేవకముందే బాస్‌ల మెసేజ్‌‌లు పలకరిస్తుంటాయి. కొంతవరకూ ఓకె. కానీ శృతి మించితే.. అదే జరిగింది. ఒక టూ ఇంటలిజెంట్‌ ‌సిఇవో తమ సిబ్బంది సీట్లో ఆసీనులు కాకముందే హాయ్‌ ‌చెప్పి ఆ పైన పనులు అంటగట్టేస్తుంటారట. గడియారం చూడొద్దు.. చేతిలో పెట్టిన పని చూడండి.. అది పూర్తయ్యాకే వెళ్లండి.. అని పురమాయిస్తుంటాడాయన. అక్కడికి ఏదో విసుగ్గా ష్యూర్‌ ‌సర్‌ అని జవాబిస్తూ నెట్టుకొస్తున్నారా ఆ ఐటియన్స్‌. కానీ ఈ మధ్య ఓ రోజు సార్‌ ‌మరీ ముందుకు పోయి ‘అసలు యజమానిలా ఆలోచించండి.. అప్పుడే బాగా పని స్వంతం చేసుకోగలరు’ అని చెప్పారట. దాంతో చిర్రెత్తిన ఓ గడుగ్గాయి...‘దాందేముంది సార్‌.. తప్పక అలాగే అనుకుంటాం. కాకుంటే కంపెనీ వాటాలో యాభై శాతం ఎప్పుడు బదలాయిస్తారో చెబుతారా?’ అని ఎదురు వడ్డించారట. ఇప్పుడు ఇదే వైరల్‌‌గా చక్కర్లు కొడుతోంది. పని భారం, అభద్రత వెంటాడుతుంటే ‘మీదే కంపెనీ అనుకోండి, మీరే ఓనర్లనుకోండి’ అని ఊరిస్తే సరిపోతుందా? వాస్తవాలు వారికి తెలియవా?

అదొక్కటే చేయలేకపోయిన అమితాబ్‌

ఎంతవారికైనా ఏదో ఒక కొరత వుంటుంది కదా. అలాగే మిలీనియం స్టార్‌, ఎనభైపదులు దాటినా ఎవర్‌ గ్రీన్‌‌లా ఎడాపెడా నటించడమేగాక ఎన్నెన్నో రూపాల్లో అలరించే అమితాబ్‌ ‌బచన్‌ ‌కూడా. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సీజన్‌‌లో ఆయన అలాగే దిగులు పడిపోయారు. ఆ సారి ఆయన ముందు అజయ్‌ అనే విజేత కూర్చున్నాడు. అజయ్‌ ‌నీవేం చేస్తుంటావని అడిగాడు బిగ్‌ ‌బి. క్విజ్జర్‌‌ను అని చెప్పాడు అజయ్‌. క్విజ్జర్‌ అని ఓ వృత్తి వుందా అంటే అవును సార్‌. మీలాంటివారు నిర్వహించే క్విజ్‌‌లకు సిద్ధం చేస్తుంటానని చెప్పి ఆశ్చర్యపరిచాడు. అయితే అజయ్‌ ఒక్కడే రాకుండా మరో అమ్మాయితో వచ్చాడు. నీవొక్కడివే కదా సెలెక్టవయ్యావు ఈ అమ్మాయిని తెచ్చావేమని అడిగాడు బాస్‌. నా గర్ల్ ఫ్రెండ్‌ అని జవాబిచ్చాడు అజయ్‌. ఇంకేముంది ‌అప్పటి వరకూ హుషారుగా ప్రశ్నలేస్తున్న అంతటి అమితాబ్‌ దిగులుపడిపోయాడు. నేను జీవితంలో చాలా విజయాలు సాధించాను కాని... నీలా చిన్నప్పుడు ఒకమ్మాయిని తీసుకెళ్లి నా గర్ల్‌ ప్రెండ్‌ అని చెప్పలేకపోయాను అని ఓటమి ఒప్పుకున్నారు. జయ బాదురి, నేను పెళ్లి చేసుకుందామని అనుకున్న రెండు రోజుల్లోనే పెళ్లి చేసుకున్నాం, ఇంట్లో చూపించే సమయం కూడా లేకపోయింది అని ముక్తాయించాడట.

ముదురుతున్న మతం పైత్యాలు

పైత్యం ముదిరి పిచ్చిగా మారిందన్నట్టు తయారవుతున్నది సనాతన రాజకీయం. తామేది చేసినా ధర్మం, ఇతరులు ఏది చేసినా రాజకీయం. హిందూ వ్యతిరేక ముద్ర. దురదృష్టవశాన లౌకిక పార్టీగా ఎన్టీఆర్‌ ‌స్థాపించిన టిడిపి కూడా ఇదే వలయంలో చిక్కుకుంది. ఎన్టీఆర్‌ ‌బిజెపితో కూడా సీట్ల సర్దుబాట్లు చేసుకున్నారని అదే పనిగా చెబుతుంటారుగానీ, రథయాత్ర తర్వాత ఆయన వారిని దగ్గరకు రానివ్వలేదని, మళ్లీ పొత్తు పెట్టుకోలేదని చెప్పరు. బాబ్రీ విధ్వంసాన్ని కూడా ఆయన ఏనాడూ ఆమోదించలేదు. కుల మతాలను సవాలు చేసే ఆయన డైలాగులు సుప్రసిద్ధమే. ఇప్పుడు ఎన్డీఎ కూటమిలో చేరి జనసేన అధినేత పవన్‌ ‌కల్యాణ్‌‌తో పోటీ పడేలా సనాతన స్టాంపు కోసం సతమతమవుతుంది టిడిపి నాయకత్వం. ఇటీవల ఎక్కడో వై.ఎస్‌ ‌రాజశేఖరరెడ్డి విగ్రహం ప్రక్షాళన పేరుతో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారట. దీనిపై వైసిపి వారు ఫిర్యాదు చేశారు సహజంగానే. వారికి రాజకీయంగా జవాబిచ్చే బదులు...పసుపు హిందూ మతంలో పవిత్రమైంది కదా. మీరు భరించలేకపోతున్నారని తప్పుపట్టాడు టిడిపి అధికార ప్రతినిధి. ఇంకేమంటారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఇటీవల ఒక కాంక్లేవ్‌‌లో మాట్లాడుతూ దక్షిణాదిన మేము శివుణ్ని ఎక్కువగా పూజిస్తాము. బిజెపి వారు ఉత్తరాది రాముడిని తెస్తారు అన్నారు. ఇందులో నిజానిజాలు భక్తులందరికీ తెలుస్తాయి కదా. పైగా శివకేశవులు, హరిహరనాథులు ఇలాంటి మాటలు ఎప్పటి నుంచో వున్నాయి కదా. రేవంత్‌ ‌హిందూ మతంలో చీలిక తెస్తున్నారని బిజెపి గగ్గోలు ఎందుకు చేస్తున్నట్టు? విశాల భారతంలో సాంస్కృతిక వైవిధ్యం ఎవరూ కాదనలేదన్నది ఇక్కడ అసలు నిజం. మేం చెప్పేదే హిందూ మతం అంటే చెల్లుతుందా?

- పీపీ


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్