గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆందోళనకరం​..

42 నిమిషాల క్రితం

suside.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 05:58 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

విశ్వవిద్యాలయాలు వేయి ఆలోచనలు వికసించే కేంద్రాలుగా ఉండాలి. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని, సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. కానీ ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ తాజా సర్వే ఆందోళనకర వాస్తవాలను బయటపెట్టింది. 2.43 లక్షలకు పైగా విద్యార్థుల నుంచి సేకరించిన వివరాల్లో గత ఏడాది కాలంలో చాలా తరచుగా ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్లు 9 శాతం మందితెలిపారు. గత ఆరు నెలల్లో దీర్ఘకాలిక ఒత్తిడి, నిరాశ లేదా ఆందోళనను ఎదుర్కొన్నట్లు మరో 15 శాతం మంది చెప్పారు. క్యాంపస్‌లో తాము ఏదో స్థాయిలో బయటి వ్యక్తులుగా భావిస్తున్నట్లు 34 శాతం మంది పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చదువు, పరీక్షలు, మార్కులు, పోటీ, ఉద్యోగావకాశాలపై అనిశ్చితి విద్యార్థులపై ఒత్తిడి పెంచుతుండగా, దానికి కులవివక్ష, లింగవివక్ష, ర్యాగింగ్, వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం తోడవుతున్నాయి. ముఖ్యంగా కులవివక్షపై టాస్క్‌ఫోర్స్‌ చేసిన పరిశీలనలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. కులం కారణంగా అవమానాలు, వివక్ష, అధ్యాపకుల నుంచి అసమాన వైఖరి వంటి అనుభవాలను విద్యార్థులు వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది. విద్యార్థి తన ప్రతిభను నిరూపించుకోవాల్సిన ప్రదేశంలో తన కులం కారణంగా తనను తాను తక్కువగా భావించే పరిస్థితి రావడం విద్యా వ్యవస్థకే అవమానం. ఇటీవల దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఈ నివేదిక ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి. 2020-21 నుంచి 2024-25 మధ్య 23 ఐఐటి సంస్థల్లో 45 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వారిలో 28 మంది ఎస్‌‌సి. ఎస్‌‌టి, ఓబిసి తరగతులకు చెందిన వారున్నారు. వరుసగా జరుగుతున్న ఈ విషాద ఘటనలకు వ్యక్తిగత అంశాలను కారణంగా చూపి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడం సమస్య మూలాలను విస్మరించడమే. విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి అవసరమైన సహాయక వ్యవస్థలు కూడా అనేక సంస్థల్లో తగినంతగా లేవని ఎన్‌‌టిఎఫ్‌ గుర్తించింది. తాజా సర్వేలో 32 శాతం మంది తమ సంస్థల్లో కౌన్సెలింగ్‌ సేవలు లేవని చెప్పారు. అంతకు ముందు 2,119 ఉన్నత విద్యాసంస్థల పరిశీలనలో 65 శాతం సంస్థల్లో విద్యార్థులకు మానసిక ఆరోగ్య నిపుణులు అందుబాటులో లేరని, 73 శాతం సంస్థల్లో అరకొరగా మాత్రమే ఉన్నారని తేలింది.

అంటే విద్యార్థి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు అతనికి మాట్లాడేందుకు, తన సమస్యను చెప్పుకునేందుకు, అవసరమైన సమయంలో సహాయం పొందేందుకు వ్యవస్థే అందుబాటులో లేని పరిస్థితి అనేక చోట్ల ఉంది. కులవివక్షను ఎదుర్కొంటున్న విద్యార్థి ఫిర్యాదు చేయడానికి భయపడటం, తన సమస్యను చెప్పినా పరిష్కారం లభించదేమోనన్న అనుమానం, కౌన్సెలింగ్‌ తీసుకుంటే తనపై ముద్ర పడుతుందన్న భయం వంటి అంశాలు కూడా పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. విద్యార్జనలో పరస్పర పోటీ ఉంటుంది. ఆరోగ్యకరంగా ఉండాల్సిన ఆ పోటీ ఒత్తిడి స్థాయికి మారి, విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసి తోటి విద్యార్థిని శత్రువుగా చూసే స్థితికి చేరకూడదు. విశ్వవిద్యాయాలు ఆత్మగౌరవాన్ని సమున్నత స్థాయికి పెంచేలా ఉండాలికానీ...కులం, సామాజిక నేపథ్యం, ఆర్థిక పరిస్థితి ఆధారంగా న్యూనతా భావాన్ని నూరిపోసేలా వుండకూడదు. విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే కర్మాగారాలు కావు. అక్కడే భవిష్యత్‌ శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజినీర్లు, రచయితలు, సామాజిక ఆలోచనాపరులు, నాయకులు తయారవుతారు. అలాంటి ప్రదేశాల్లో భయం, వివక్ష, ఒత్తిడి, అవమానం, న్యూనతాభావాలకు తావు ఇవ్వడమంటే మన వేళ్లను మనమే నరుక్కున్నట్టే! కులవివక్షపై కఠినమైన చర్యలు, సమర్థవంతమైన ఫిర్యాదు వ్యవస్థ, అందుబాటులో ఉండే కౌన్సెలింగ్‌, విద్యార్థులతో నిరంతర సంభాషణ, అధ్యాపకులకు మానసిక ఆరోగ్యంపై శిక్షణ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సకాలంలో సహాయం వంటి చర్యలు చేపట్టడం తక్షణ అవసరం. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి విశ్వవిద్యాలయాలపై వ్యతిరేక వైఖరితో నిర్ణయాలు తీసుకుంది. అభ్యుదయ, ప్రజాతంత్ర భావాలకు పోటీగా భూస్వామ్య, ఆధిపత్య, మత, మనువాద భావజాలాలను ప్రోత్సహిస్తోంది. ఇవి విద్యార్థుల్లో కుల, మత విభజనలు మరింతగా పెరగడానికి కారణమవుతున్నాయి. ఇవన్నీ ఎన్‌టిఎఫ్‌ప్రాథమిక నివేదికలోని పరిశీలనలు, సూచనలు స్పష్టం చేస్తున్న అవసరాలే. పూర్తి స్థాయి తుది నివేదికలో మరిన్ని ముఖ్యమైన సూచనలు, పరిష్కార మార్గాలు చేర్చే అవకాశం ఉంది. ఆ నివేదికను మరో అధికారిక పత్రంగా భద్రపరచడం కాకుండా, అందులో సూచించే అవసరమైన చర్యలను అమలు చేయడానికి ప్రభుత్వం, విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు సిద్ధపడాలి. విశ్వకవి రవీంద్రుడు చెప్పినట్లు ‘ఎక్కడ మనసు భయం లేకుండా ఉంటుందో.. ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా ప్రవహిస్తుందో..’ అలాంటి వాతావరణం మన విశ్వవిద్యాలయాల్లోనూ నెలకొనాలి. విద్యార్థులు భయపడకుండా ప్రశ్నించేలా, వివక్షకు తలవంచకుండా నిలబడేలా, ఓటమికి కుంగిపోకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించేలా... వారి ఆలోచనలను స్వేచ్ఛగా వికసింపజేసేలా విద్యాసంస్థలు మారాలి. నిజమైన విద్యకు అదే అర్ధం! విశ్వవిద్యాలయాల పరమార్ధం కూడా అదే!​​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్