శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పరీక్షల ఒత్తిడికి బలవుతున్న విద్యార్థులు

3 గంటల క్రితం

suicides
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 10:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పదేళ్లలో 80 శాతం పెరిగిన ఆత్మహత్యలు

- 2014-2024 మధ్య 1.23 లక్షల మంది విద్యార్థులు బలవన్మరణం

- నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వివాదం, విద్యార్థుల ఆందోళనల మధ్య ఎన్‌‌సిఆర్‌‌బి గణాంకాలు వెలుగులోకి

న్యూఢిల్లీ : మోడీ పాలనలో విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్రమవుతున్నాయి. దేశంలో ఇవి ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. గత పదేండ్లలో (2014-2024 మధ్య) విద్యార్థుల ఆత్మహత్యలు దాదాపు 80 శాతం పెరిగాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌‌సిఆర్‌‌బి) గణాంకాలు ఈ కఠిన వాస్తవాలను వెల్లడించాయి. 2014-2024 మధ్య మొత్తం 1.23 లక్షల మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, వారిలో ఐదుగురిలో ఒకరు పరీక్షల్లో విఫలమవడమే ప్రధాన కారణంగా ప్రాణాలు తీసుకున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌, విద్యార్థుల ఆత్మహత్యలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో ఈ గణాంకాలు విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడిని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.

(ఎన్‌‌సిఆర్‌‌బి) విడుదల చేసిన ''ఆక్సిడెంటల్‌ డెత్స్‌ అండ్‌ సూసైడ్స్‌ ఇన్‌ ఇండియా (ఎడిఎస్‌ఐ)'' నివేదిక ప్రకారం..2014లో 8,068 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2024లో ఈ సంఖ్య 14,488కు చేరుకుంది. అంటే పదేండ్లలో విద్యార్థుల ఆత్మహత్యలు సుమారు 80 శాతం పెరిగాయి. 2024లో సగటున ప్రతి రోజూ 40 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. 2014 నుంచి 2024 వరకు మొత్తం 1,23,000 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

పరీక్షల్లో వైఫల్యం... ప్రతి ఐదుగురిలో ఒకరికి కారణం

ఎన్సీఆర్బీ నివేదికలో 'పరీక్షల్లో విఫలమవడం' అనే కారణాన్ని ప్రత్యేకంగా పేర్కొంది. 2014-2024 మధ్య జరిగిన మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో 21 శాతం, అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు పరీక్షల్లో విఫలమవడాన్ని ప్రధాన కారణంగా చూపినట్టు నివేదిక తెలిపింది. మొత్తంగా 25 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షల్లో విఫలమైన కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి ఏడాది సాధారణంగా 2,000 మందికిపైగా విద్యార్థులు పరీక్షల్లో విఫలమై ప్రాణాలు తీసుకుంటున్నారని గణాంకాలు వెల్లడించాయి.

55 శాతం మంది 18 ఏండ్ల లోపువారే!

పరీక్షల్లో విఫలమై ఆత్మహత్య చేసుకున్న వారిలో 55 శాతం మంది 18 ఏండ్లలోపు వారు ఉన్నారు. ఇక42 శాతం మంది 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు వారు ఉన్నారు. అంటే ఎక్కువగా పాఠశాల, కళాశాల దశలో ఉన్న యువతే ఈ విషాదానికి గురవుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.

మహారాష్ట్రలో అధికం

విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో రాష్ట్రాల వారీగా చూస్తే..మహారాష్ట్రలో అత్యధికంగా 17 వేలకుపైగా విద్యార్థుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో తమిళనాడు, మధ్యప్రదేశ్‌, కర్నాటక, యూపీలు ఉన్నాయి. పరీక్షల్లో విఫలమవడమే కారణంగా జరిగిన ఆత్మహత్యల్లో కూడా మహారాష్ట్ర ముందంజలో ఉంది. 2014-2024 మధ్య అక్కడే 4,200 మందికి పైగా విద్యార్థులు పరీక్షల్లో విఫలమై ఆత్మహత్య చేసుకున్నారు. అంటే సగటున ప్రతి ఏడాది 382 మంది విద్యార్థులు ఈ కారణంతో ప్రాణాలు కోల్పోయారు.

కొన్ని రాష్ట్రాల్లో మరింత తీవ్ర పరిస్థితి

దేశవ్యాప్తంగా పరీక్షల్లో విఫలమవడం వల్ల జరిగే విద్యార్థుల ఆత్మహత్యలు 21 శాతంగా ఉండగా... జార్ఖండ్‌, త్రిపుర, కర్నాటక, బీహార్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో ఇది జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదవటం గమనార్హం. కాగా దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలకు ఒత్తిడి, కుటుంబ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సంబంధాల సమస్యలు వంటివి కూడా తోడవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.

'మనోదర్పణ్‌'కు 3.32 లక్షల కాల్స్‌

విద్యార్థులకు మానసిక, సామాజిక సహాయం అందించేందుకు 2020లో ప్రారంభించిన 'మనోదర్పణ్‌' హెల్ప్‌లైన్‌కు 2026 మార్చి నాటికి 3.32 లక్షలకుపైగా కాల్స్‌ వచ్చినట్లు కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది. ఒకవైపు ప్రభుత్వాల వైఫల్యాలతో పాటు విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, పరీక్షలపై తీవ్రమైన పోటీ, తరచూ వెలుగులోకి వస్తున్న ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో లోపాలు, భవిష్యత్తుపై అనిశ్చితి వంటి అంశాలు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్