చెన్నై : మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను కేంద్రం రద్దుచేయాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. పరీక్షల నిర్వహణలో పదేపదే అక్రమాలు, కోచింగ్ కేంద్రాల విస్తరణ, విద్యార్థుల ఆత్మహత్యల వంటి కారణాలతో నీట్ పరీక్షలను రద్దు చేయాలని తీర్మానించింది. ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కె.జి.అరుణ్‌రాజ్ మంగళవారం అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం -2019, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చట్టం-2020, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి చట్టం-2020, ఇతర సంబంధిత చట్టాలను సవరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఇంటర్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా రాష్ట్రంలో మెడికల్ కోర్సుల్లో చేరేందుకు ఈ తీర్మానం అనుమతిస్తుంది.
నీట్ సామాజిక న్యాయానికి, సమానత్వానికి విరుద్ధమని, వైద్య విద్యకు సంబంధించిన విషయాలలో రాష్ట్రాల హక్కులను ఉల్లంఘిస్తుందని తమిళనాడు ప్రభుత్వం నిరంతరం వాదిస్తూ వస్తోందని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. తమిళ మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులు సహా గ్రామీణ, సామాజిక- ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు లభించే అవకాశాలను ఈ పరీక్ష దెబ్బతీస్తుందని తీర్మానం తెలిపింది. విద్యార్థులపై ఆర్థికభారం మోపడమే కాకుండా నీట్ ఆధారిత కోచింగ్ పేరుతో కోచింగ్ సెంటర్లు దోచుకునేందుకు అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. 12ఏళ్ల పాఠశాల విద్యను కాదని ఒక్క రోజు నిర్వహించే పరీక్షలో వచ్చే మార్కులు విద్యార్థులు మెడికల్ కోర్సుల్లోకి ప్రవేశించే అర్హతను నిర్ణయిస్తాయని తెలిపింది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు లక్షలాది విద్యార్థులను తీవ్రమైన మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయని, దీంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వెల్లడించింది. నీట్ పరీక్ష దేశంపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుందని, దీంతో ఈ పరీక్షను రద్దు చేయాలని తీర్మానం స్పష్టం చేసింది. నేరుగా ప్రవేశం కల్పించే విధానం ద్వారా మెడికల్ కాలేజీలో సీటు పొంది, ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సి)లో ఐదున్నరేళ్ల పాటు సేవలందించిన వ్యక్తిగా ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని తాను గర్వంగా భావిస్తున్నాని అన్నారు. విద్యను ఉమ్మడి జాబితా నుండి రాష్ట్ర జాబితాకు బదిలీ చేయడమే ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారమని మంత్రి అరుణ్ రాజ్ పేర్కొన్నారు. అయితే, ఏకైక బిజెపి ఎమ్మెల్యే అయిన ఎం. భోజరాజన్ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఓటింగ్ ముందే సభ నుండి వాకౌట్ చేశారు.
నీట్ నుండి రాష్ట్రానికి మినహాయింపునివ్వాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ పలు తీర్మానాలను ఆమోదించిన సంగతి తెలిసిందే. గతంలో డిఎంకె ప్రభుత్వ హయాంలో 2021లో నీట్ నుండి రాష్ట్రాన్ని మినహాయించాలంటూ ‘తమిళనాడు అడ్మిషన్ టు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సెస్ బిల్లు (ఎల్.ఎ.బిల్ నెం.43 ఆఫ్ 2021) ’ ని ఆమోదించింది. అయితే, ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనలో ఉంచారు, రాష్ట్రపతి ఆమోదం పొందలేదు.







కామెంట్‌లు (0)