చెన్నై : వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అర్హులైన కుటుంబాలకు ఏడాదికి మూడు ఎల్‌పిజి సిలిండర్ల ఖర్చును ప్రభుత్వం తిరిగి చెల్లించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకం కింద ఈ ప్రయోజనాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఏడాదికి రూ.2.5 లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.4,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు ఎల్‌పిజి సిలిండర్ కొనుగోలు చేసిన అనంతరం, సంబంధిత వివరాలను చమురు కంపెనీల నుంచి సేకరించి, సిలిండర్ ఖర్చుకు సంబంధించిన మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని విజయ్ తెలిపారు. ఈ పథకం ద్వారా తక్కువ ఆదాయ కుటుంబాలపై వంటగ్యాస్ వ్యయ భారాన్ని తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీలో సోమవారం చేసిన ప్రకటనలో ఈ పథకాన్ని తొలి దశలో ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లతో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఎన్నికల సమయంలో ఏడాదికి ఆరు ఎల్‌పిజి సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఏడాదికి మూడు ఎల్‌పిజి సిలిండర్ల ఖర్చు తిరిగి చెల్లింపు : తమిళనాడు సిఎం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 11:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)