- మూతపడితే డేటావ్యవస్థకు పెను ముప్పే
న్యూఢిల్లీ : మనం పంపే ప్రతి సందేశంలోని డేటా సముద్ర గర్భంలో సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణంలో కొంత భాగం బాబ్-ఎల్ మందెబ్ జలసంధి మీదుగా సాగుతుంది. ఇది చాలా ఇరుకైన సముద్ర మార్గం. వాణిజ్య నౌకలకు ప్రధాన రహదారిగా మాత్రమే కాకుండా ప్రపంచ ఇంటర్నెట్‌కు కీలక ధమనిగా కూడా పనిచేస్తోంది. యెమన్, జిబూటీ మధ్య సుమారు 26 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న బాబ్`ఎల్ మందెబ్ జలసంధి ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్, హిందూ మహా సముద్రాన్ని కలిపే అనుసంధాన మార్గం. యూరప్, ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల మధ్య డేటాను మోసుకొని పోయే అనేక సముద్ర కేబుల్స్‌ను ఈ జలసంధి మీదుగానే ఏర్పాటు చేశారు. ఈ కేబుల్స్ చివరికి సూయజ్ కాలువను, ఆపై మధ్యధరా సముద్రాన్ని చేరుకుంటాయి.
నిఘా సంస్థల కన్ను
సుమారు 17 సముద్ర గర్భ కేబుల్స్ ఈ జలసంధి మీదుగానే వెళుతున్నాయి. ఇవి యూరప్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఎక్కువగా డేటాను రవాణా చేస్తాయి. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో సుమారు 17 శాతం, యూరప్‘ఆసియా కమ్యూనికేషన్లలో 90 శాతానికి పైగా వాటా ఈ జలసంధిదే. ఈ జలసంధి కేవలం డేటా ప్రసారాలకే పరిమితం కాదు. ఈ మార్గంలో అనేక అంతర్జాతీయ కేబుల్స్ ఉండడంతో గత కొన్ని సంవత్సరాలుగా నిఘా సంస్థల దృష్టి కూడా దీనిపై పడుతోంది.
జలసంధిలో నిర్మించిన కేబుల్ ఇవే
బాబ్ - ఎల్ మందెబ్‌లో నిర్మించిన కేబుల్స్ విషయానికి వస్తే... ఒకటి ఈజిప్ట్, ఎర్ర సముద్రం మీదుగా ఐరోసాను మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, ఆగ్నేయాసియాలతో కలుపుతుంది. మరొకటి ఫ్రాన్స్‌ను ఈజిప్ట్, బాబ్-ఎల్ మందెబ్ మీదుగా మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలతో కలుపుతుంది. ఇంకొకటి ఫ్రాన్స్‌ను సింగపూర్‌తో కలుపుతుంది. వేరొకటి తూర్పు ఆసియాను దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, జలసంధి, ఈజిప్ట్ మీదుగా ఐరోపాతో కలుపుతుంది. ఓ కేబుల్ మన దేశాన్ని యూఏఈ, సౌదీ అరేబియా, జలసంధి, ఈజిప్ట్ మీదుగా ఐరోపాతో కలుపుతుంది. భారత్‌కు చెందిన టాటా కమ్యూనికేషన్ భాగస్వామ్యంతో దీనిని నిర్మించారు. భారత్‌ను ఐరోపాతో కలిపే ప్రధాన సమాచార మార్గాలలో ఇదొకటి.
బాబ్- ఎల్ మందెబ్‌లో నిర్మించిన ఒక కేబుల్ మధ్యధరా సముద్రం, ఈజిప్ట్, జలసంధి, అరేబియా సముద్రం ద్వారా బ్రిటన్, యూరప్‌లను భారత్‌తో కలుపుతుంది. ఈ కన్సార్టియంలో మన దేశానికి చెందిన భారతీ ఎయిర్‌టెల్ ముఖ్యమైన వాటాదారుగా ఉంది. కాగా మరో కేబుల్ ఈజిప్ట్, జలసంధి, పర్షియన్ గల్ఫ్, హిందూ మహా సముద్రం ద్వారా యూరప్‌ను ఆసియాతో కలుపుతోంది. దీనిని ప్రస్తుతం భారత్‌కు చెందిన గ్లోబల్ క్లౌడ్ ఎక్స్‌ఛేంజ్ సంస్థ నిర్వహిస్తోంది. ఇవి కాకుండా ఫాల్కన్, పీస్, సీకామ్, 2 ఆఫ్రికా కేబుల్స్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు డేటాను సరఫరా చేస్తున్నాయి.







కామెంట్‌లు (0)