- సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్
హైదరాబాద్: కోట్లాది మంది భారతీయుల ఓటు హక్కును ఏదైనా ప్రక్రియ ద్వారా సామూహికంగా తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నిర్వహించిన జస్టిస్ బోధ్ రాజ్ సావ్నీ మెమోరియల్ మూట్ కోర్టు పోటీ ముగింపు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత పౌరుడి వ్యక్తిత్వం నుంచి ఓటు హక్కును లేదా ఓటర్ల జాబితాలో పేరు ఉండే హక్కును వేరు చేయడం శరీరం నుంచి ఆత్మను తీసివేయడమేనని జస్టిస్ భుయాన్ వ్యాఖ్యానించారు. కోట్లాది మందిని ఓటు హక్కు లేని పౌరులుగా మార్చే ప్రక్రియ సహజంగానే ఏకపక్షంగా ఉంటుందని, దానికి ఎలాంటి కారణాలు చూపినా సమర్థించలేమని అన్నారు.
రాజ్యాంగంలోని 14, 326 అధికరణలు ఓటు హక్కుకు కీలకమైన రక్షణ కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన భారత పౌరులకు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఓటు హక్కు ఉంటుందని తెలిపారు. ఆర్టికల్ 326లోని సార్వత్రిక వయోజన ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి కీలకమైన పునాది అని వివరించారు.
ఓటర్ల జాబితాలో ఇప్పటికే ఉన్న వ్యక్తి పేరును తొలగించే ముందు తగిన నోటీసు, తన వాదన వినిపించే అవకాశం కల్పించడం అవసరమని కూడా జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. ధనవంతుడైనా, రిక్షా కార్మికుడైనా వారి ఓటు విలువ సమానమేనని, ఇదే భారత రాజ్యాంగం చూపిన సమానత్వ దృక్పథమని ఆయన అన్నారు.







కామెంట్‌లు (0)