వాషింగ్టన్: పసిఫిక్ మహాసముద్రంలో అంతర్జాతీయ డేట్‌లైన్‌ను దాటిన శక్తివంతమైన హరికేన్ నోలో ఇప్పుడు టైఫూన్‌గా మారింది. ఆదివారం డేట్‌లైన్‌ను దాటిన తర్వాత దీనికి ‘టైఫూన్ నోలో’గా పేరు మారింది. పేరు మారినప్పటికీ తుఫాను తీవ్రతలో పెద్దగా మార్పు లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం, టైఫూన్ నోలో లిసియాన్స్కి ద్వీపానికి పశ్చిమ-నైరుతి దిశలో సుమారు 395 మైళ్ల (640 కిలోమీటర్ల) దూరంలో ఉంది. గంటకు 17 మైళ్ల (28 కిలోమీటర్ల) వేగంతో పశ్చిమ దిశగా కదులుతోంది. నోలోలో గరిష్ఠంగా గంటకు 115 మైళ్ల (185 కిలోమీటర్ల) వేగంతో గాలులు వీచినట్లు హరికేన్ సెంటర్ వెల్లడించింది.
అంతకుముందు నోలో కేటగిరీ-3 హరికేన్‌గా బలపడింది. వారం క్రితం హవాయిని హరికేన్‌గా దాటిన ఈ తుఫాను అనంతరం బలహీనపడి ఉష్ణమండల తుఫానుగా మారింది. ఆ తర్వాత తిరిగి హరికేన్ స్థాయికి చేరుకుంది. తుఫాను ప్రస్తుతం విశాలమైన సముద్ర ప్రాంతంలో ఉండటంతో తక్షణం భూభాగానికి ముప్పు లేదని నిపుణులు తెలిపారు. పశ్చిమ దిశగా కదులుతున్న నోలో సమీప భవిష్యత్తులో ఏ భూభాగాన్నీ ప్రభావితం చేసే అవకాశం లేదని అంచనా వేశారు.
ఇదిలా ఉండగా, పసిఫిక్‌లోని మరో తుఫాను రాచెల్ మెక్సికోకు దూరంగా పశ్చిమ దిశగా కదులుతోంది. సముద్రంలోకి మరింత ముందుకు వెళ్తున్న కొద్దీ పశ్చిమ-మధ్య మెక్సికో తీరం, బాహా కాలిఫోర్నియా ద్వీపకల్ప ప్రాంతాల్లో ప్రమాదకరమైన అలలు, ఉప్పెనలు ఏర్పడే అవకాశం ఉందని హరికేన్ సెంటర్ హెచ్చరించింది.







కామెంట్‌లు (0)