‘అవ్వా! నేను బడికి పోతున్నా!’ అని భుజానికి సంచి తగిలించుకుని బయటికి వచ్చాడు రుద్రాంశ్. ‘ఒరేయ్ భడవా! ఆగరా! పిల్లి ఎదురుగా వస్తోంది. అపశకునం!’ అంటూ కంగారుగా అంది లచ్చవ్వ. ‘అబ్బా! నువ్వెప్పుడూ ఇంతే. పిల్లీ నేను ఒకరికొకరం ఎదురయ్యాం. పిల్లి ఎదురు నాకు అపశకునం అయినప్పుడు నా ఎదురు కూడా దానికి అపశకునం అవుతుంది కదా! చెల్లుకు చెల్లు?’ అంటూ బడికి వెళ్లిపోయాడు రుద్ర. ‘వీడిది అంతా వితండ వాదన’ అని మనసులో అనుకుంది.
రుద్ర వెళ్లిపోయాడే గానీ, లచ్చవ్వ మనసులో భయం మొదలైంది. ‘పిల్లి ఎదురొచ్చింది. వాడికి ఏం కీడు జరుగుతుందో!’ అనుకుంటూ పనుల్లో పడింది. సాయంత్రం బడి విడిచే సమయానికి వీధి గుమ్మంలో కూర్చుని రుద్ర రాక కోసం ఆతృతగా ఎదురు చూసింది. కాసేపటికి పరిగెత్తుకుంటూ ఇంటికి చేరాడు రుద్ర. వాడిని చూడగానే లచ్చవ్వ దగ్గరకు తీసుకుని, ‘నీకు ఏమీ కాలేదు కదరా!’ అని అడిగింది. ‘నాకేం అవుతుంది అవ్వా? ఎందుకలా భయపడుతున్నావు?’ అన్నాడు రుద్రాంశ్.
‘పిల్లి ఎదురైతే మంచిది కాదంటారు. నీకేం జరుగుతుందోనని రోజంతా భయపడ్డాను’ అంది లచ్చవ్వ. ‘అవ్వా! నీ ఎదురు మంచిది కాదని ఎవరైనా నీతో అంటే నీకేమనిపిస్తుంది?’ అడిగాడు రుద్ర. లచ్చవ్వ కాసేపు మౌనంగా ఉండి, ‘ఏమోరా! పెద్దవాళ్లు చెప్పారు. మేము విన్నాం. అంతే. కానీ నీలా ఎదురు ప్రశ్నలు వేయలేదు’ అంది. ‘ఈరోజు బడిలో జరిగిన రెండు పోటీల్లో పాల్గొని రెండింటిలోనూ బహుమతులు గెలుచుకున్నాను. ఇప్పుడు చెప్పు, పిల్లి వల్ల ఏమైనా కీడు జరిగిందా?’ అని అడిగాడు రుద్రాంశ్. లచ్చవ్వకు ఏం చెప్పాలో తోచలేదు.
‘పిల్లి ఆహారం కోసం తన దారిన తాను పోతోంది. మనం మన దారిన పోతున్నాం. ఇందులో అపశకునం ఏముంది?’ అన్నాడు రుద్ర. లచ్చవ్వ మౌనంగా వాడి మాటలు వింటోంది. ‘మనం పెంచుకున్న పిల్లి ఎలుకలను పట్టుకుంటే ఎంతో మంచిది. అదే మనకు ఎదురొస్తే చెడ్డది. ప్రతిదాన్నీ గుడ్డిగా నమ్మకూడదని మా సైన్సు మాస్టారు చెప్పారు. పిల్లి ఎదురొస్తే కీడు జరుగుతుందనేది కూడా ఒక మూఢనమ్మకమేనట!’ అన్నాడు రుద్రాంశ్. ‘మీ మాస్టారు చెప్పింది నిజమే అనిపిస్తోంది. చిన్నవాడివైనా బాగా చెప్పావు’ అని లచ్చవ్వ రుద్రాంశ్‌ను దగ్గరకు తీసుకుని ముద్దాడింది.
- కాశీవిశ్వనాథం పట్రాయుడు,
శృంగవరపుకోట,
94945 24445.







కామెంట్‌లు (0)