సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిమ్ లేదు.. టవర్ లేదు.. ‘లోరా’తో ఉగ్రవాదుల కమ్యూనికేషన్

1 గంట క్రితం

terror
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 08:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: మొబైల్ నెట్‌వర్క్, సిమ్ కార్డు అవసరం లేకుండానే పరస్పరం సంభాషించేందుకు ఉగ్రవాదులు ‘లోరా’ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. జమ్మూ కశ్మీర్‌లోని ఎన్‌కౌంటర్ ప్రాంతాల్లో ఎన్‌క్రిప్టెడ్ ఆఫ్-గ్రిడ్ హ్యాండ్‌సెట్‌లు లభించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 29న బుద్గాంలోని గుర్వత్ కలాన్‌లో హతమైన లష్కర్-ఎ-తైబా కమాండర్ మహమ్మద్ ఆసిఫ్ అలియాస్ హషీం మూసా ఫౌజీ వద్ద ‘లోరా అల్ట్రా’ పరికరం లభించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌కు దూరంగా ఉండి, ఉగ్రవాదులు పరస్పరం, అలాగే పాకిస్థాన్‌లోని తమ హ్యాండ్లర్లతో కమ్యూనికేట్ చేసేందుకు ఈ పరికరాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడించింది. ‘లోరా’ సాంకేతికతను అడవులు, పర్వత ప్రాంతాల్లో సుదూర కమ్యూనికేషన్ కోసం ఉపయోగించవచ్చు. పరికరాలు పరస్పరం సిగ్నల్స్‌ను ప్రసారం చేసుకోవడం ద్వారా ప్రత్యేక కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండటంతో, సాధారణ మొబైల్ నెట్‌వర్క్ ఆధారిత నిఘా వ్యవస్థలకు సవాలు ఎదురవుతోంది.

దాచిగామ్–పహల్గామ్ ప్రాంతంలో ‘ఆపరేషన్ మహాదేవ్’ సందర్భంగా కూడా పలు లోరా పరికరాలు, సిమ్ కార్డులు లేని ఫోన్లు లభించినట్లు సమాచారం. ఈ పరికరాలు స్థానికంగా తయారు చేసినవి కాకుండా, ముందుగానే కాన్ఫిగర్ చేసి ఎన్‌క్రిప్ట్ చేసినవిగా భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. లోరా సిగ్నల్స్‌ను గుర్తించేందుకు దక్షిణ కశ్మీర్‌లోని అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు స్పెక్ట్రమ్ స్కానర్లు, జామర్లను మళ్లీ మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొబైల్ సిమ్ కార్డులు, టవర్ కనెక్షన్ల ఆధారంగా సాగిన నిఘా వ్యవస్థలు.. ఇకపై ఇలాంటి ‘సైలెంట్ రేడియో’ కమ్యూనికేషన్ పరికరాలను గుర్తించడంపైనా దృష్టి సారించనున్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్