సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమార్పులు మేము ఆమోదించలేదు

2 గంటల క్రితం

supreem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 12:40 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఎస్‌ఐఆర్‌పై విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

  • కేంద్రప్రభుత్వం, ఎన్నికల సంఘం, సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌లకు నోటీసులు జారీ

  • తక్షణ సస్పెన్షన్‌కు నిరాకరణ.. ఇసి వివరణ తీసుకున్న తర్వాతే నిర్ణయం

​ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియలో ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న ఫారం–6లో చేసిన మార్పులను సుప్రీంకోర్టు ఆమోదించలేదని ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ సహా ఎన్నికల సంఘం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జోయమాల్య బాగ్చి, జస్టిస్‌ వి.మోహనల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సంబంధిత పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఫారం–6లో మార్పులను సుప్రీంకోర్టు ఆమోదించిందంటూ ఎన్నికల సంఘం ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో సిజెఐ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. “మార్చిన ఫారం–6ను మేము ఆమోదించలేదు. దీనిపై స్పష్టత ఉండాలి. రికార్డులు సమర్పించినప్పుడు ఎవరు ఈ మార్పులు చేశారో పరిశీలిస్తాం” అని సిజెఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. బీహార్‌ ఎస్ఐఆర్‌పై మే 2026లో ఇచ్చిన తీర్పులో కొత్తగా మార్చిన ఫారం–6ను సుప్రీంకోర్టు పరిశీలించలేదని కూడా విచారణ సందర్భంగా స్పష్టమైంది. కొత్త ఫారం–6లో తొలిసారి ఓటరుగా నమోదు చేసుకునే వ్యక్తి తాను లేదా తన తల్లిదండ్రులు గత ఎస్ఐఆర్‌ జాబితాలో ఉన్నారా అనే వివరాలను వెల్లడించాల్సి వస్తోంది. ఈ అదనపు వివరాలను చేర్చడంపై ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పిటిషన్లలో పేర్కొన్నారు.

​సిఇసి సస్పెన్షన్‌కు నిరాకరణ

ఎస్ఐఆర్‌కు సంబంధించి ఎన్నికల సంఘంలో 14 కీలక నిర్ణయాలను సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తీసుకున్నారన్న ఆరోపణలపై మరో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌లో జ్ఞానేష్‌ కుమార్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందుగా ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, సిఇసి, ఇతర సంబంధిత అధికారుల స్పందన తెలుసుకోవాల్సి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది వికాస్‌సింగ్‌ అత్యవసర మధ్యంతర చర్యలు అవసరమని వాదించారు. ఎస్ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలు ఎన్నికల సంఘం చట్టపరమైన విధానాలకు విరుద్ధంగా ఏకపక్షంగా తీసుకున్నట్లయితే అవి ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మాత్రమే తక్షణ నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం పేర్కొంది.

​ఉల్లంఘించారని తేలితే చర్యలు తీసుకుంటాం..

ఎన్నికల సంఘం నిర్ణయాలు చట్ట ప్రకారం ఏకగ్రీవంగా లేదా అవసరమైన సందర్భంలో మెజారిటీ అభిప్రాయంతో ఉండాల్సిన నిబంధనను పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రస్తావించారు. దీనిపై సిజెఐ స్పందిస్తూ, చట్టపరమైన నిబంధనలను ఎన్నికల సంఘం పాటించాలని, ఏదైనా ఉల్లంఘన జరిగినట్లు రికార్డుల ద్వారా తేలితే సంబంధిత నిర్ణయాలను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలు, ఓటర్ల జాబితా డేటా నిర్వహణ, ఫారం–6 మార్పులు తదితర అంశాలపై స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్‌ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని మరో పిటిషన్‌లో కోరారు. ఎస్ఐఆర్‌ సందర్భంగా భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించారన్న ఆరోపణలపై ఇసిఐ నెట్‌, ఇఆర్ఒ నెట్‌, డేటాబేస్‌లను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయాలని కూడా పిటిషనర్‌ కోరారు. ఇరు పిటిషన్లపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతో ఎస్ఐఆర్‌ ప్రక్రియలో ఎన్నికల సంఘం నిర్ణయాలపై న్యాయపరమైన పరిశీలనకు మార్గం సుగమమైంది. ఫారం–6 మార్పులపై సుప్రీంకోర్టు చేసిన స్పష్టీకరణ కూడా ఈ వ్యవహారంలో కీలకంగా మారడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్