- ‘అడుసు తొక్కనేల... కాలు కడగనేల?’
కొల్‌కతా : కావాలనే అడుసు తొక్కి వ్యతిరేకత వస్తే కాలు కడుక్కోవడం బిజెపి విధానంగా మారింది. జాతీయోద్యమంపై దానికి నాయకత్వం వహించిన నేతలపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు పదేపదే తీవ్రమైన నిందలు వేయడం, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తరువాత అది వ్యక్తుల విమర్శగా చిత్రీకరించడం అలవాటుగా మారింది. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రుతో పాటు అనేకమంది జాతీయోద్యమ నాయకులను తూలనాడడం బిజెపి నేతలకు అలవాటుగా మారింది. గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడుగా కీర్తించే బిజెపి ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద విమర్శలను ఎక్కుపెట్టింది.
అనంత మహారాజ్ గా పిలవబడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిజెపి రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్ భారతదేశ స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రశ్నిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా ‘దేశభక్తులలో రాకుమారుడు’ అని మహాత్మా గాంధీ చేత పిలవబడిన నేతాజీ బోస్ ను ‘యుద్ధ నేరస్థుడు’ అని, ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ‘అందులో వున్న వారందరూ బ్రిటీష్ సైనికులే కదా’ అని కించపరుస్తూ మాట్లాడారు. జాతీయోద్యమ చరిత్ర గురించి నాగేంద్ర రాయ్‌కి ఏ మాత్రం అవగాహన ఉన్నా ఇలాంటి విమర్శలు చేసి వుండేవారుకాదు. రాయ్ మాటలపై బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా వచ్చిన విమర్శలతో బిజెపి నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బిజెపికి చెందిన ఓ ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు రాయ్ కు ఈ ఏడాది ఫిబ్రవరి 21న తొలిసారిగా ప్రదానం చేసిన ‘బంగా బిభూషణ’ అవార్డును ఉపసంహరించుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.
దీనికి ముందు చాలా కథ నడచింది, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాయ్ పై సుమోటో చర్య తీసుకోవాలని ఒక న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిజెఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అభ్యర్థనను తిరస్కరించింది. దానికి బదులుగా అధికారిక రిట్ పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ జయమాల్య బాగ్చి సూచించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ, ఢిల్లీ విద్యార్థుల ఉద్యమ నేపథ్యం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వేడుకలకు ఆహ్వానించవద్దని న్యాయవిద్యార్థులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలకు సిద్దపడింది. ‘ఆయన (నాగేంద్ర రాయ్) ఒక సీనియర్ సిటిజన్, పైగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. నేనే దీనిని సానుకూల చర్యగా భావిస్తున్నాను’ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేంద్ అధికారి సన్నాయి నొక్కులు నొక్కడం వెనుక వారి ఉద్ధేశ్యం ఏమిటో స్పష్టమవుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23ను ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకుంటామని 2022లో ప్రధాని మోడీ ప్రకటించారు. సుభాష్ చంద్రబోస్‌ను తన పార్టీకి చెందిన ఎంపీ ఇంత దిగజారుడు విమర్శలు చేసినా ప్రధాని, బిజెపి జాతీయ అధ్యక్షుడు ఎందుకు మౌనంగా వున్నారు. గతంలో నేతాజీ మేనల్లుడు చంద్రబోస్ ను బిజెపిలో చేర్చుకున్న సందర్భంగా ‘చరిత్రలో నేతాజీకి తగినంత స్థానం ఇవ్వలేదని, ఆయన కుటుంబానికి దక్కాల్సిన రాజకీయ గౌరవం దక్కలేదని’ విమర్శించిన బిజెపి అగ్రనేతలు ఇప్పుడు స్పందించకపోవడం ద్వారా నేతాజీ పై నాగేంద్ర రాయ్ చేసిన విమర్శ వ్యక్తిగతమా, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వైఖరిలో భాగమా అనే సందేహం కలగడం సహజం.








కామెంట్‌లు (0)