న్యూఢిల్లీ : భారత ఎంఎంఏ ఫైటర్ వరుణ్ సన్యాల్ ఆసియా క్రీడలకు దూరమయ్యాడు. 77 కేజీల విభాగంలో పోటీ పడాల్సిన వరుణ్.. బరువు తగ్గించే ప్రక్రియలో భాగంగా సౌనాలో ఉండగా స్పృహ కోల్పోయాడు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు అతడిని పోటీకి అనర్హుడిగా ప్రకటించారు. బరువు తూచే ప్రక్రియకు ముందు ఆహారం, ద్రవపదార్థాల నియంత్రణతో పాటు ‘‘సౌనా ( చెమట ద్వారా బరువు తగ్గించే ప్రక్రియ) ” ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. సౌనాలోకి వెళ్లిన సుమారు 30 నిమిషాల తర్వాత వరుణ్‌కు కళ్లు తిరగడం, తల తేలిపోతున్నట్లు అనిపించడం, కండరాల నొప్పులు రావడంతో అక్కడే స్పృహ కోల్పోయినట్లు అతడి వైద్య పరిస్థితిపై రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు. తోటి అథ్లెట్, ఎంఎంఏ ఇండియా అధ్యక్షుడు నిఖిల్ కుందర్ అతడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా పోటీకి అనర్హుడిగా ప్రకటించారు.
ఆసియా క్రీడల్లో తొలిసారిగా ఎంఎంఏను ప్రవేశపెట్టారు. దీంతో ఎంఎంఎలో వరుణ్ పతకం సాధిస్తాడని ఆశించిన భారత్‌కు నిరాశ ఎదురైంది. 2026 జనవరిలో చైనాలో జరిగిన ఆసియా ఏఎంఎంఏ ఛాంపియన్‌షిప్‌లో అతడు కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు 2025లో ఎంఎంఏ ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించి ఆసియా ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. అయితే ఆసియా క్రీడలకు అర్హత ప్రక్రియపై స్పష్టత లేకపోవడంతో చివరి దశ వరకు అతడి పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగింది. పోటీలు ప్రారంభానికి కేవలం రెండు వారాల ముందు మాత్రమే తుది ధ్రువీకరణ రావడంతో తనకు సిద్ధమయ్యేందుకు తక్కువ సమయం లభించిందని వరుణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
భారత జట్టులోని మరో ఎంఎంఏ ఫైటర్ సుచిక తరియల్ మహిళల 60 కేజీల విభాగంలో క్వార్టర్‌ఫైనల్ గెలిచి భారత్‌కు పతకం ఖాయం చేసింది. ఆమె తదుపరి సెమీఫైనల్ పోటీలో పాల్గొననుంది.







కామెంట్‌లు (0)