కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో అక్టోబర్ 6న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు అభ్యర్థుల అరెస్టులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. రెజినగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సైఫుల్ ఇస్లాంను 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హుమయూన్ కబీర్ నేతృత్వంలోని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఎజెయుపీ)తో సైఫుల్ ఇస్లాంకు సంబంధాలు ఉన్నాయి. మరోవైపు, నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిలన్ ప్రధాన్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు సంబంధించిన సుమారు రెండు దశాబ్దాల నాటి కేసులో ప్రధాన్‌ను ఈ అరెస్టు జరిగింది. ఈ రెండు అరెస్టులు ఉప ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రెజినగర్ నుంచి ఎన్నికైన హుమయూన్ కబీర్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో రెజినగర్ స్థానాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. మరోవైపు ముఖ్యమంత్రి సువేందు అధికారి భవానీపూర్, నందిగ్రామ్ రెండు స్థానాల్లో విజయం సాధించిన అనంతరం భవానీపూర్ స్థానాన్ని కొనసాగిస్తూ నందిగ్రామ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రెజినగర్‌లో సైఫుల్ ఇస్లాం అరెస్టు 2021లో జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించినదని పోలీసులు తెలిపారు.
ఇదే సమయంలో, రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై ఎజెయుపీ అధినేత హుమయూన్ కబీర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణాధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. సెప్టెంబర్ 14న కేసు నమోదు చేసిన పోలీసులు, బెర్హంపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆడియో రికార్డింగ్‌ను విడుదల చేశారు. అందులో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను ప్రేరేపించే కుట్రకు సంబంధించిన అంశాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ముర్షిదాబాద్ జిల్లాలో వాహనాల తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ, అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకుని ఎజెయుపీ రాష్ట్ర కార్యదర్శి ఆశిక్ ఇక్బాల్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.







కామెంట్‌లు (0)