విజయవాడ : ఆదివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ... ముందుగా పార్టీ తీర్మానాలను వెల్లడించారు. అనంతరం రాష్రాన్ని తీవ్ర స్థాయిలో వేధిస్తున్న కరువు విషయమై మాట్లాడారు.
తీర్మానం -1
తక్షణమే కరువు ప్రాంతాలను ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలి.
జాతీయ విపత్తుగా భావించి, కేంద్రం నుండి లక్ష కోట్లు సహాయం రాబట్టాలి.
రైతుల రుణాలు మాఫీ చేయాలి, కౌలు రైతులకు పంట నష్ట పరిహారం వర్తింప చేయాలి.
అన్ని పంటలకు బీమా అమలు చేయాలి. బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి.
ఉపాధి పనులు చూపాలి.
పశువులకు మేత కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
గడచిన 30 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతటి విపత్కర కరువు పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. ఎల్ నినో గురించి వాతావరణ శాస్త్రవేత్తలు ముందు నుండి హెచ్చరికలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 55% లోటు వర్షపాతం నమోదు కాగా రాయలసీమలో 65%, అన్నమయ్య జిల్లాలో 70% లోటు వర్షపాతం ఉంది. వేసిన కంది, పత్తి, మిర్చి, వేరుశనగ, ఆముదం, వరి, మొక్కజొన్న వంటి పంటలు ఎండిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిపోయి 10 సంవత్సరాలుగా పెంచిన చీని చెట్లు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి. వందల ఎకరాలలో చీని చెట్లు తొలగిస్తున్నారు. కనుక తక్షణమే కరువుగా ప్రకటించాలి. కరువు సహాయక చర్యలు చేపట్టాలి. త్రాగునీటికి కొరతలేకుండా చూడాలి. వేసిన పంటలను కాపాడాలి.
తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాలలో విత్తనాలు కూడా పడలేదు. పంటలు వేసిన సుమారు 55 లక్షల ఎకరాలలో కూడా 20 శాతం మించి పంటలు చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం నుండి రూ. లక్ష కోట్లు రాబట్టి ప్రజలను ఆదుకోవాలి.
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ త్రాగునీటికి కొరతలేకుండా త్రాగునీటి పథకాలకు అవసరమైన మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. త్రాగునీటికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలి. వారబంది పద్దతిలో ఉన్న పంటలను కాపాడాలి. గోదావరి డెల్టా మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కరువు తీవ్రంగా ఉన్నది. 625 మండలాలకు పైగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. 400 మండలాలలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, 224 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలలో 40% పైగా భూములలో ఎలాంటి పంటలు వేయలేదు. కృష్ణాజిల్లా కోడూరు, నాగాయలంక మండలాలు పల్నాడు, బాపట్ల, ప్రకాశం మార్కాపురం జిల్లాలలో లక్షల ఎకరాలలో ఎలాంటి పంటలు వేయలేదు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలోని మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ భాగం విత్తనాలు వేసినా పంటలు చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వేసిన పంటలలో 20% కూడా పంట దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు లేనందున వ్యవసాయ పనులు లేవు.
శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీళ్లను తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు వదలటంతో హంద్రీనీవా క్రింద చెరువులు పాక్షికంగా నింపారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద లక్షల ఎకరాలు వరి నాట్లు పడలేదు. గోదావరి నీటితో కృష్ణా జిల్లాలో కొంత ప్రాంతంలో వరి నాట్లు వేశారు. వేసిన వరి పంటను కాపాడుకునేందుకు రైతులు వేల రూపాయల ఖర్చు పెట్టి ఆయిల్ ఇంజన్లతో నీళ్లు తోడి పోస్తున్నారు. ఈ పరిస్థితులను అంచనా వేసేందుకు ఉన్నతాధికారులు, కేంద్ర కరువు బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి. కరువు తీవ్రతను అంచనా వేయాలి. జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం నుండి ఉదారంగా సహాయం రాబట్టాలి. రాష్ట్రాన్ని, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను గ్రామీణ ప్రజలను ఆదుకోవాలి.
(1)కరువు జిల్లాలను ప్రకటించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి.
(2)జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం నుండి లక్ష కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం రాబట్టాలి.
(3)రూ. 2.00 లక్షల వరకు సన్న చిన్న కారు రైతుల రుణాలు మాఫీ చేయాలి. కొత్త రుణాలు ఇవ్వాలి. పనిలేనందున పొదుపు మహిళలు రుణాలు చెల్లించడం కష్టంగా ఉంది. వడ్డీలు రద్దు చేయాలి.
(4)వాస్తవ సాగుదారులకే పంట నష్ట పరిహారం, బీమా పరిహారం ఇవ్వాలి.
(5)ఉపాధి పని దినాలు పెంచాలి. అడిగిన వారందరికీ పని చూపాలి. లేదా భత్యం ఇవ్వాలి.
(6)తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని మంచినీటి పంపింగ్ కేంద్రాలకు మరమ్మత్తులు చేయాలి. త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి.
(7)ప్రాజెక్టుల ఏరియాలో వారబందీ పద్ధతిలో నీళ్లు ఇచ్చి ఉన్న పంటలను కాపాడాలి.
(8)కౌలు రైతులు చెల్లించిన ముందస్తు కౌలును వెనక్కు ఇప్పించాలి. దేవాలయ భూముల కౌలు రైతుల నుండి బలవంతపు కౌలు వసూలు ఆపాలి.
(9)ఎలాంటి షరతులు లేకుండా అన్ని పంటలకు భీమా వర్తింప చేయాలి. బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి. ఇప్పటికే రైతులు చెల్లించిన బీమా ప్రీమియంను ప్రభుత్వం రీయంబర్స్ చేయాలి.
(10)రబీ సాగు విత్తనాలు వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వం రైతులకు తక్షణమే పంపిణీ చేయాలి.
(11) పశువులు, గొర్రెలు, జీవాలకు మేత కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
(12)ఆయిల్ ఇంజన్‌లతో పంటలను కాపాపాడుకుంటున్న రైతులకు డీజిల్, పెట్రోలు సబ్సిడీతో ఇవ్వాలి.
= = = =
తీర్మానం -2
ఇళ్లు, ఇళ్ళ స్థలాలపై ఒట్టి మాటలు కట్టిపెట్టి, నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. హామీలు నెరవేర్చాలి.
పేదలకు గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించి, పక్కా ఇళ్ల నిర్మాణాలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆర్భాటపు ప్రకటనలతో సరిపెట్టడం శోచనీయం. గత రెండున్నర సంవత్సరాల కాలంలో పేదలకు స్థలాలు సేకరించలేదు, ఇవ్వలేదు.ఇళ్ల నిర్మాణాలు కొత్తవి చేపట్టలేదు. చేపట్టినవి నత్త నడకన నడుస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసగించడానికి ముఖ్యమంత్రి తాజాగా ప్రకటనలు చేస్తున్నారు. తక్షణమే స్థలాలు సేకరించాలని ఒకవైపు చెబుతూ మరోవైపు పట్టణాల్లో స్థలాలు లేవని ప్రభుత్వం చేతులెత్తేయటం గర్హనీయం. స్థలాలు లేవనే సాకుతో పట్టణాలలో 11 నుండి 14 అంతస్తుల భవనాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపడతారని వార్తలు వస్తున్నాయి. 15 నుండి 17 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి వ్యయం మౌతుందని ప్రకటిస్తున్నారు.
2014 -19 కాలంలో ఏడు లక్షలకు పైగా టిడ్కో ఇళ్ల నిర్మాణం చేస్తామని ప్రకటించి, దానిని 3 లక్షలకు కుదించారు. అందులో ఇప్పటికీ 1,70,000 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని ప్రభుత్వమే ప్రకటించింది. అందులోనూ 76 వేల ఇళ్ళు లబ్ధిదారులకు కేటాయించలేదు. కేటాయించిన ఇళ్లల్లోనూ సౌకర్యాలు లేక, పేదలు నివాసం ఉండే అవకాశం లేకుండా పోయింది. ఇళ్ళు ఇవ్వకుండానే బ్యాంకులు వడ్డీలతో సహా రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. పేదలందరూ అప్పుల పాలయ్యారు. ఈ పథకం పూర్తిగా విఫలమయ్యింది. ఈ అనుభవాలను గమనించకుండా ప్రభుత్వం 15 అంతస్తుల భవనాలు, 17 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేస్తామని చెప్పటం సరికాదు. వివిధ ప్రాంతాలలో నిర్మించిన ఈ బహుళ అంతస్తుల భవనాలలో మౌలిక సదుపాయాలు లేక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిర్వహణ కష్టంగా మారింది. పేదలు అప్పుల పాలవుతున్నారు. గృహ నిర్మాణ పథకాల లక్ష్యమే దెబ్బతింటున్నది.
కావున ప్రభుత్వం బహుళ అంతస్తులు భవనాలు కాకుండా హామీ ఇచ్చిన విధంగా పట్టణాల్లో రెండు సెట్లు, గ్రామాలలో మూడు సెంట్లు ప్రజలు కోరుకున్న ప్రాంతాల్లో, నివాసాలకు సమీపంలో కేటాయించాలి. ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల తగ్గకుండా కేటాయించి ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వమే చేపట్టాలి. గతంలో నిర్మించుకున్న ఇళ్లకు బకాయిలు ఇవ్వాలి. గతంలో ఇచ్చిన జగనన్న కాలనీలు ఇళ్ళు, స్థలాలు అనేక చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. నివాసయోగ్యంగా లేవు. కావున నివాసయోగ్యం కానీ వాటిని రద్దుచేసి, తాజాగా రెండు, మూడు సెంట్లు స్థలాలు ఇవ్వాలి. కొత్త లే ఔట్ లు వేయాలి. ఇళ్లు నిర్మించాలి. పాత కాలనీలలో, టిడ్కో ఇళ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. గృహ రుణాలు రద్దు చేయాలి.
తీర్మానాల అనంతరం .... రాష్ట్రాన్ని వేధిస్తున్న తీవ్ర కరువు విషయమై మాట్లాడారు.
కరువు మండలాలు, ప్యాకేజీ ప్రకటించాలి
సిఎం, డిప్యూటీ సిఎంకు కరువు ప్రాంతాల్లో పర్యటించే తీరికలేదా ?
జాతీయ విపత్తుగా కరువు - కేంద్రం లక్షకోట్లు ప్యాకేజీ ఇవ్వాలి
రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆందోళనకు మద్దతు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
బడా పెట్టుబడిదారుల లాభాపేక్షతోనే ఎల్‌నినో
22ఏపై పబ్లిక్ స్క్రూటినీకి డిమాండు
అసైన్‌మెంట్ కమిటీలు పునరుద్దరించాలి
రాష్ట్రం తీవ్ర కరువులోకి వెళ్లిపోతోందని, వెంటనే కరువు మండలాలు ప్రకటించడంతోపాటు, ప్యాకేజీ కూడా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఆదివారం బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాంతో కలిసి ఆయన మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను తీర్మానాలను మీడియాకు వెల్లడించారు. కరువు విజృంభిస్తోందని, తీవ్ర ఎల్‌నినో ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోకపోడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాల్లో వామపక్ష పార్టీలు పర్యటించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. రైతు, వ్యవసాయ కార్మిక, కౌలురైతు సంఘాలు 21వ తేదీన ధర్నాలకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలు ప్రకటిస్తామని తెలిపిందన్నారు. పరిస్థితులు తీవ్రంగా మారుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందని అన్నారు. పెట్టుబడిదారుల కోసం దేశదేశాలు తిరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్, లోకేష్‌బాబుకు కరువు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల బాధలు తెలుసుకుని, రైతులను పరామర్శించే తీరికలేదా అని ప్రశ్నించారు. మరోవైపు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయమని అన్నారు. ఈ నేపథ్యంలో కరువు ప్రభావిత మండలాలు ప్రకటించి ఆదుకునేందుకు ప్యాకేజీ కూడా ఇవ్వాలన్నారు.
బడా పెట్టుబడిదారులు లాభాపేక్ష కోసం పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వచ్చే ఏడాది తీవ్ర ఎల్‌నినో ఉండే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని, కేంద్రం స్పందించి నివారణకు లక్ష కోట్లు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండు చేశారు. ఇదే సమయంలో పర్యావరణాన్ని దెబ్బతీసే డేటా సెంటర్లను విశాఖలో పెడుతున్నారని, దీనికి నీరు, విద్యుత్ పెద్ద ఎత్తున అవసరం ఉంటుందని అన్నారు. ఇది ఉష్ణోగ్రతలను మరింత పెంచుతుందని వివరించారు. కనీసం పర్యావరణ ప్రభావ అంచనా కూడా లేకుండా నేరుగా అనుమతులు ఇచ్చేస్తున్నారని పేర్కొన్నారు. పర్యావరణాన్ని దెబ్బతీసేలా పెట్టే పర్రిశమలకు అనుమతులు ఇవ్వకూడదన్నారు. 50 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తే 20 లక్షల ఎకరాల్లో కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. అలాగే రుణాలు రద్దు చేయాలని, ఉపాధిహామీ పనులు 200 రోజులు కల్పించి ప్రభుత్వం నిర్ణయించిన మేరకై కనీసం వేతనం రూ.310కి తగ్గకుండా చూడాలని కోరారు. ఈనెల 21వ తేదీ నుండి రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు చేసే ఆందోళనలకు పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. కౌలు రైతులకు ఒక్కో కుటుంబానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అలాగే పశువులకు మేత కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.
అందరికీ ఇంటి స్థలం- 22ఏపై పబ్లిక్ స్క్రూటినీకి డిమాండు
రాష్ట్రంలో ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న అందరికీ ఇళ్లస్థలం ఇవ్వాలని శ్రీనివాసరావు కోరారు. ఎన్నికల ముందు అందరికీ ఇళ్లస్థలం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. 22ఏ కింద 12 లక్షల ఎకరాల్లో అక్రమాలు జరిగాయని చెప్పి ఆపేసి ఇప్పుడు లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేశారని అన్నారు. అసైన్డ్ భూములను పెత్తందారులు, శతకోటీశ్వరులు దురాక్రమణ చేశారని విమర్శించారు. అసైన్డ్ కమిటీలను పునరుద్దరించి ఈ భూముల ఫ్రీ హోల్డ్‌పై స్క్రూటినీ చేయాలని, పేదలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తున్న భూములన్నీ పెద్దల చేతుల్లో ఉన్నవేనని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం మాట్లాడుతూ ఎపిలో 54 శాతం పంటలు దెబ్బతిన్నాయని, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ప్రజలను ఆదుకోవాలని కోరారు.







కామెంట్‌లు (0)