89 పతకాలతో 4వ స్థానంలో భారత్
నగోయా(జపాన్): 5వ ఆసియా పారా క్రీడల్లో శీతల్ దేవి మరో రెండు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో ఇప్పటికే బంగారు పతకం సాధించిన శీతల్.. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్‌లో మరో బంగారు పతకాన్ని సాధించింది. ఈ స్వర్ణం పతకం గెలుపుకు ముందు తోమన్ కుమార్‌తో కలిసి కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలోనూ పసిడి పతకం ముద్దాడింది. దీంతో ఈ ఆసియా పారా క్రీడల్లో శీతల్‌కు దక్కిన స్వర్ణ పతకాల సంఖ్య మూడుకు చేరింది. అలాగే మహిళల డబుల్స్‌లో పాయల్ నాగ్‌తో కలిసి రజతాన్ని సాధించింది. దీంతో నాల్గోరోజు పోటీలు ముగిసేసరికి భారత్ 21స్వర్ణ, 27 రజత, 41 కాంస్యాలతో సహా మొత్తం 89 పతకాలతో 4వ స్థానంలో ఉంది.
డిస్కస్ త్రోలో సువర్ణ రాజ్
డిస్కస్ త్రోలో సువర్ణ రాజ్ మరో బంగారు పతకాన్ని అందించింది. మహిళల ఎఫ్54 డిస్కస్ త్రోలో 15.66 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించింది. 44 ఏళ్ల సువర్ణ, ఆరు ప్రయత్నాల్లో నాలుగుసార్లు డిస్కస్‌ను 15 మీటర్లకు పైగా విసిరి ఐదో ప్రయత్నంలో 15.66 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని ముద్దాడింది.
టేబుల్ టెన్నిస్‌లో భవినా జోడీకి కాంస్యం
మిక్స్‌డ్ డబుల్స్ ఎక్స్‌డీ7 టేబుల్ టెన్నిస్‌లో భారత జోడీ భవినా పటేల్, శుభమ్ వాధ్వా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన జాంగ్ యంగ్‌జిన్, లీ మిగ్యూ జోడీ చేతిలో ఓడిపోయింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఎస్‌ఎల్3 విభాగంలో సంజనా కుమారి, పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4 కేటగిరీలో అభిజీత్, సుహాస్ యతిరాజ్ కాంస్యాలను సాధించారు.








కామెంట్‌లు (0)