మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

షఫాలీ వర్మకు ఐసీసీ మందలింపు.. ఖాతాలో డీమెరిట్ పాయింట్!

39 నిమిషాల క్రితం

2083084-shafali-verma.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 04:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

జింబాబ్వేతో మూడో టీ20 మ్యాచ్‌కు ముందు భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాక్ ఇచ్చింది. రెండో టీ20లో మైదానంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. షఫాలీకి అధికారికంగా మందలింపు జారీ చేయడంతో పాటు, ఆమె క్రమశిక్షణా రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.

అసలేం జరిగిందంటే?

రాయ్‌పూర్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో జింబాబ్వే ఇన్నింగ్స్‌ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీ చరణి వేసిన 12వ ఓవర్‌లో చిపో ముగెరి-తిరిపానో మిడ్‌ ఆఫ్‌ దిశగా బంతిని ఆడగా, షఫాలీకి క్యాచ్‌ పట్టే అవకాశం లభించింది. అయితే, ఆమె ఆ సులభమైన క్యాచ్‌ను జారవిడిచింది. దీంతో నిరాశకు గురైన షఫాలీ బంతిని కోపంతో నేలకేసి విసిరింది.

ఆర్టికల్‌ 2.2 కింద చర్యలు

అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో క్రికెట్‌ పరికరాలు, దుస్తులు లేదా మైదానానికి సంబంధించిన పరికరాలను దుర్వినియోగం చేయడాన్ని ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.2 నిషేధిస్తుంది. షఫాలీ చర్యను లెవల్‌-1 ఉల్లంఘనగా పరిగణించిన ఐసీసీ.. ఆమెకు అధికారిక మందలింపు విధించింది. గత 24 నెలల్లో ఆమెకు ఇదే తొలి ఉల్లంఘన కావడంతో ఒక డీమెరిట్‌ పాయింట్‌తో సరిపెట్టింది.

షఫాలీ తన తప్పును అంగీకరించి, మ్యాచ్‌ రిఫరీ జీఎస్‌ లక్ష్మి ప్రతిపాదించిన శిక్షను అంగీకరించింది. దీంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే చర్యలు పూర్తయ్యాయి.

రెండో మ్యాచ్‌లో షఫాలీ మెరుపులు

మైదానంలో క్యాచ్‌ వదిలేసి నిరాశపరిచిన షఫాలీ.. బ్యాటింగ్‌లో మాత్రం అదరగొట్టింది. జింబాబ్వే నిర్దేశించిన 103 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 25 బంతుల్లోనే 55 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. స్మృతి మంధానతో కలిసి జట్టుకు శుభారంభం అందించింది. భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. కాగా, లెవల్‌-1 ఉల్లంఘనలకు ఐసీసీ నిబంధనల ప్రకారం అధికారిక మందలింపు నుంచి మ్యాచ్‌ ఫీజులో గరిష్ఠంగా 50 శాతం జరిమానా వరకు విధించవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు డీమెరిట్‌ పాయింట్లు కేటాయించే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్