- పురుషులు, మహిళల జట్లకు స్వర్ణాలు
చైనా : ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు, పురుషుల జట్టు స్వర్ణాలు సాధించాయి. చైనాతో జరిగిన ఫైనల్‌లో భారత మహిళా జట్టు 1-0 తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను భారత క్రీడాకారిణి సానిక చంద్రకాంత్ మనే 17వ నిమిషంలో సాధించింది. భారత మహిళల జట్టు ఈ కప్‌ను గెలుచుకోవడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. 2023 ఎడిషన్‌లో దక్షిణ కొరియాను ఓడించి తొలి టైటిల్ సాధించిన భారత్.. 2024 ఎడిషన్‌లో చైనాను మట్టికరిపించి రెండోసారి విజేతగా నిలిచింది. తాజాగా ఆసియా కప్ ఛాంపియన్‌గా అవతరించిన భారత జట్టు జూనియర్ ప్రపంచ కప్‌లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్వర్ణా పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల బృందానికి హాకీ ఇండియా నగదు ప్రోత్సాహం ప్రకటించింది. టైటిల్ నిలబెట్టుకున్న భారత పురుషుల జట్టు ఈ టోర్నమెంట్‌లో పురుషుల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో భారత్ 4-1 తేడాతో కొరియాను ఓడించింది. భారత్ తరఫున అజిత్ యాదవ్ (9వ నిమిషం), అన్మోల్ (13వ), ప్రభ్‌దీప్‌సింగ్ (21వ), అషు మౌర్య (50వ) గోల్స్ చేశారు. కొరియా ఓటమి ఖాయమైన తర్వాత 54వ నిమిషంలో ఆ జట్టు ప్లేయర్ లీ మిన్-హ్యోక్ గోల్ చేశాడు. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా నాలుగో టైటిల్ కావడం విశేషం. గత మూడు ఎడిషన్లలో (2015, 2023, 2024) పాకిస్థాన్ ప్రత్యర్థి కాగా.. మూడుసార్లు చిరకాల ప్రత్యర్థిని భారత్ చిత్తుగా ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.








కామెంట్‌లు (0)