బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

INDW-ZIMW:జింబాబ్వేపై భారత మహిళల ఘన విజయం

4 గంటల క్రితం

ind vs zim.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 06:46 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మూడు టీ20ల సిరీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌

జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళల జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో కైవసం చేసుకుంది. సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లోనూ టీమిండియా సత్తా చాటింది. బ్యాటింగ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, షెఫాలీ వర్మ పరుగుల వరద పారించగా.. బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో భారత్‌ 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే మహిళల జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

హర్మన్‌ప్రీత్‌, షెఫాలీ దూకుడు

టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆరంభం నుంచే జింబాబ్వే బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. షెఫాలీ 37 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు పునాది వేయగా, హర్మన్‌ప్రీత్‌ కేవలం 41 బంతుల్లోనే 91 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో భారత స్కోరు పరుగులు పెట్టింది. అనుష్క శర్మ 28 పరుగులతో రాణించింది. అయితే మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రిచా ఘోష్‌ (1) , నిక్కీ ప్రసాద్‌ (9), అరుంధతీ రెడ్డి (4), ప్రేమ రావత్‌ (4) పరుగులు చేశారు. దీప్తి శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది. అయినప్పటికీ అగ్రశ్రేణి బ్యాటర్ల దూకుడుతో భారత్‌ 216 పరుగుల భారీ స్కోరును సాధించింది.

బౌలింగ్‌లోనూ మెరిసిన టీమిండియా

భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు ఆదిలోనే కళ్లెం వేశారు. అయితే షార్నే మయర్స్‌ 60 పరుగులతో పోరాటం చేయగా, బిజా 44 పరుగులు సాధించింది. ఈ ఇద్దరు మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 124 పరుగులే చేయగలిగింది. నందనీ శర్మ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టు పతనంలో కీలక పాత్ర పోషించింది. క్రాంతి గౌడ్‌, అరుంధతీ రెడ్డి, నిక్కీ ప్రసాద్‌, దీప్తి శర్మ తలో వికెట్‌ సాధించారు. చివరి ఓవర్‌లో నందనీ శర్మ రెండు వికెట్లు తీసి జింబాబ్వే ఇన్నింగ్స్‌కు ముగింపు పలికింది. దీంతో భారత్‌ 92 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్