ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చివరి మ్యాచ్‌లో మెస్సీకి భావోద్వేగ వీడ్కోలు..

07 అక్టోబర్, 2026

messi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 08:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 10వ నిమిషంలో ఆట నిలిపివేత

- అభిమానుల కన్నీటి వీడ్కోలు

బ్యూనస్ ఎయిర్స్: మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీకి.. జాతీయ జెర్సీలో చివరి మ్యాచ్‌ సందర్భంగా భావోద్వేగ వీడ్కోలు లభించింది. బెనిన్‌తో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో మెస్సీ అర్జెంటీనా జెర్సీలో చివరిసారిగా మైదానంలోకి దిగడంతో స్టేడియం మొత్తం భావోద్వేగంతో నిండిపోయింది. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మెస్సీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిన 10వ నంబర్ జెర్సీకి గుర్తుగా మ్యాచ్ 10వ నిమిషంలో ఒక నిమిషం పాటు ఆటను నిలిపివేశారు. ఆ క్షణంలో బెనిన్ ఆటగాళ్లు మెస్సీ వద్దకు వచ్చి కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. గ్యాలరీలో ఉన్న అభిమానులు ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లతో మెస్సీకి ఘనంగా వీడ్కోలు పలికారు. “మెస్సీ.. మెస్సీ..” అంటూ స్టేడియం మార్మోగిపోయింది. అర్జెంటీనా ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా ఈ దిగ్గజానికి గౌరవం తెలిపారు. బెనిన్ కెప్టెన్ సెస్క్ డి అల్మెయిడా ప్రత్యేక బహుమతిని అందజేసి మెస్సీకి అభినందనలు తెలిపారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి అర్ధభాగం గోల్స్ లేకుండానే ముగిసింది. అయితే రెండో అర్ధభాగం ప్రారంభమైన వెంటనే అర్జెంటీనా ఆధిక్యంలోకి వెళ్లింది. 48వ నిమిషంలో నికోలస్ ఒటమెండి గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్‌కు మెస్సీ సహకారం అందించడం మరో ప్రత్యేకతగా నిలిచింది.

గోల్‌ కోసం, విజయాల కోసం, ప్రపంచకప్‌ కోసం ఎన్నో ఏళ్లుగా అర్జెంటీనా అభిమానులను ఉర్రూతలూగించిన మెస్సీ.. చివరి జాతీయ మ్యాచ్‌లోనూ తన ముద్ర వేశారు. ఒక ఆటగాడి వీడ్కోలు కంటే ఇది ఓ యుగానికి ముగింపు అన్నట్లుగా స్టేడియంలో ప్రతి క్షణం కనిపించింది. అభిమానుల కళ్లలో కన్నీళ్లు.. గుండెల్లో మాత్రం ఒకే పేరు — లియోనెల్ మెస్సీ.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్