హాంగ్జౌ: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లోకి భారత ద్వయం చిరాగ్ శెట్టి-సాత్విక్ సాయిరాజ్ దూసుకెళ్లారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత జంట మూడుసెట్ల హోరాహోరీ పోరులో మలేషియా జంటను ఓడించారు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో భారత జంట 21-16, 18-21, 21-11తో మలేషియాకు చెందిన మహమ్మద్ అర్యాన్, టాన్-వుయ్‌లను చిత్తుచేశారు. తొలి గేమ్‌ను చేజిక్కించుకున్న భారత జంటకు రెండో గేమ్ గట్టి పోటీ ఎదురైంది. 18-18పాయింట్లతో సమంగా ఉన్న దశలో మలేషియా జంట వరుసగా రెండు పాయింట్లు చేజిక్కించుకొన్నారు. నిర్ణయాత్మక మూడో, చివరి గేమ్‌లో 4వ సీడ్ సాత్విక్-చిరాగ్ జంట తమ అనుభావాన్ని ఉపయోగించి మ్యాచ్‌ను ముగించారు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత జంట చైనాకు చెందిన హీ-జింగ్ టిన్, ఝియాంగ్ యూలతో తలపడనున్నారు. వీరు రెండో సెమీస్‌లో 23-21, 17-21, 21-17తో మలేషియాకు చెందిన టీ-కియా, యాప్ రోయ్ కింగ్‌లను ఓడించారు. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్లోకి టాప్‌సీడ్, కొరియాకు చెందిన అన్-సే-యంగ్, జపాన్‌కు చెందిన అన్‌సీడెడ్ మియాజాకి ప్రవేశించారు. అన్-సే యంగ్ 21-13, 21-15తో 3వ సీడ్, జపాన్‌కు చెందిన యమగుచిని చిత్తుచేయగా.. మియాజాకి 21-19, 23-21తో చైనాకు చెందిన 2వ సీడ్ వాంగ్ జీ హిను ఓడించింది. ఇక పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి హాంకాంగ్‌కు చెందిన లీ చౌక్, గునవాన్ ప్రవేశించారు. సెమీస్‌లో లీ చౌక్ 21-15, 21-19తో 2వ సీడ్ ఫ్రాన్స్‌కు చెందిన పొపొవ్‌ను, గునవాన్ 15-21, 22-20, 2116తో 5వ సీడ్, డెన్మార్క్‌కు చెందిన ఆంటోన్సెన్‌ను ఓడించారు.
ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లో ఓడిన అన్మోల్ ఖర్బ్
జకార్తా వేదికగా జరుగుతున్న ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో సెమీస్‌కు చేరిన ఏకైక షట్లర్ అన్మోల్ ఖర్ఖ్ ఓటమిపాలైంది. శనివారం చైనాకు చెందిన షూ-వెన్-జింగ్‌తో తలపడిన అన్మోల్ 16-21, 19-21తో ఓటమిపాలైంది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన అన్మోల్.. 81వ ర్యాంకర్ జు వెన్ జింగ్ చేతిలో ఓడింది.








కామెంట్‌లు (0)