మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరూ.వెయ్యి కోట్లు కేటాయించాలి

51 నిమిషాల క్రితం

pogaku
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 09:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఎస్‌‌టిసి ద్వారా పొగాకు కొనాలి : కె ప్రభాకర్ రెడ్డి

  • కనిగిరి పొగాకు వేలం కేంద్రం సందర్శన

ప్రజాశక్తి- కనిగిరి (మార్కాపురం జిల్లా) : పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌‌టిసి ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కనిగిరి పొగాకు వేలం కేంద్రాన్ని మంగళవారం సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న వేలం తీరును పరిశీలించారు. వేలం సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. రైతులతోనూ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పొగాకు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తోందని తెలిపారు. గిట్టుబాటు ధర కోసం పొగాకు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమం వంద రోజులు దాటినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరమన్నారు. నోబిడ్, లోబిడ్‌లు పెరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని జూన్‌‌లో పొగాకు బోర్డు అధికారులు ఇచ్చిన హామీ అమలు కావడం లేదన్నారు. కిలోను కనీసం రూ.200కు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ పొగాకు కంపెనీలు దీనిని అమలు చేయడం లేదని తెలిపారు. అయినా, ప్రభుత్వం చోద్యం చేస్తోందని, పొగాకు కంపెనీలపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు. గతంలో కిలో పొగాకు ధర రూ.220 ఉండేదని, ప్రస్తుతం రూ.160, రూ.140కు కూడా కంపెనీలు కొనుగోలు చేయడం లేదని తెలిపారు. వేలం కేంద్రాలు ప్రారంభమై నాలుగు నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ 40 శాతం పొగాకు కూడా కొనుగోలు పూర్తి కాలేదన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ పొగాకు నాణ్యత దెబ్బతింటోందని, ఇదే పరిస్థితి కొనసాగితే ఒక్కో బేరన్‌కు రూ.ఐదు లక్షల నుంచి రూ.ఆరు లక్షల వరకు రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కిలోకు రూ.20 వ్యత్యాసపు ధర వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగమూ ఉండదన్నారు. దానికి బదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వెయ్యి కోట్లు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రైతుల నుంచి పొగాకును పూర్తిగా కొనుగోలు చేయాలని, కిలోకు కనీస ధర రూ.250, సగటు ధర రూ.280 కంటే తక్కువ కాకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు కనిగిరి పొగాకు వేలం కేంద్రం వద్ద నిర్వహించే ధర్నాలో రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పిల్లి తిప్పారెడ్డి, జిల్లా కార్యదర్శి ఊస వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్