వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి డిమాండ్
ఏలూరు జిల్లా ఇరిగేషన్ కార్యాలయం వద్ద పేదలతో కలిసి ధర్నా
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్ :ఎర్రకాల్వ మిగులు భూములు పేదలకు పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి.రమాదేవి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా ఇరిగేషన్ కార్యాలయం వద్ద పేదలు మంగళవారం ధర్నా చేశారు. తొలుత పెద్ద రైల్వేస్టేషన్ నుండి ఇరిగేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నాలో రమాదేవి మాట్లాడుతూ పేదలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పేదలు గత పదేళ్ల నుండి ఎర్రకాలువ మిగులు భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఈ భూములు సాగు చేసే వారిలో దళితులు, గిరిజనులు, ఇతర కులాల్లోని పేద, నిరుపేదలు ఉన్నారన్నారు. 2013 భూ సేకరణ చట్టప్రకారం ప్రభుత్వ భూముల్లో పేదలు సాగు చేసుకుంటే వారికి అన్ని రకాల సౌకర్యాలూ కల్పించాలని ఉన్నప్పటికీ ఈ విషయంలో ఇరిగేషన్ అధికారులు తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. పేదలు సాగు చేసుకుంటున్న భూముల్లోకి భూస్వాములు వచ్చి పంటను ధ్వంసం చేసినా వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం శోచనీయమన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ పేదల భూములకు ఏక్ సాల్ పట్టాలు ఇవ్వాలని, పేదలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన భూస్వాములపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా అనంతరం ఇన్చార్జి సూపరింటెండెంట్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు గుడెల్లి వెంకట్రావు, వై.సీత, ఎం.జీవరత్నం, ఎస్.కోటేశ్వరరావు, సి.రామయ్య, దుర్గ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్, గిరిజన సంఘం నాయకులు ఎం.సుధారాణి, టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలాల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పోతురాజు, అశోక్, ఎ.విశ్వేశ్వరరావు, జోడే సూర్యచంద్రం, దుర్గ, రామలక్ష్మి, కుమారి, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)