ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఏలూరు జిల్లా కలిదిండి మండలంలోని 2,044.18 ఎకరాల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 1949లో మాజీ సైనికుల కోసం ఏర్పాటు చేసిన సొసైటీకి కేటాయించిన 1,548.51 ఎకరాల్లో భాగంగా ఈ భూములు ఉన్నాయి. అసలు కేటాయింపుదారులు, వారి వారసులు దీర్ఘకాలంగా ఈ భూములను సాగు చేస్తూ వస్తున్నారు. 1983లో అర్హులైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున డీ-ఫారం పట్టాలు జారీ చేశారు. మొత్తం 1,548.51 ఎకరాలను 22 ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడంతో భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదేవిధంగా మండలంలోని 495.67 ఎకరాల భూములను 22 ఏ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలని నిర్ణయిచింది. 1950లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కలిదిండి గ్రామంలోని 129 సర్వే నంబర్ల పరిధిలో ఉన్న 495.67 ఎకరాల లోతట్టు బంజరు భూములను వీరవాసరం గ్రామానికి చెందిన ఎం. సత్యనారాయణమూర్తికి ఎకరాకు రూ.15 చొప్పున భూమి విలువ చెల్లించే షరతుపై కేటాయించారు.
తదుపరి ఆయన కుమారుడు ఎం. శ్రీరంగనాయకులు భూమి విలువగా రూ.8,940 చెల్లించగా, 1952లో తహసీల్దార్ డీ-ఫారం పట్టా జారీ చేసి భూములను అప్పగించారు. కాగా, కేటాయింపు నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కొంత భూమి 10 ఏళ్లలోపే ఇతరులకు బదలాయింపైనప్పటికీ, మొత్తం భూములను క్రమబద్ధీకరించాలన్న ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ సమర్పించారు. జిల్లా కలెక్టర్, సీసీఎల్‌ఏ సిఫారసులను పరిశీలించిన ప్రభుత్వం మొత్తం 2,044.18 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది.








కామెంట్‌లు (0)