ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రభుత్వం : రైతులకు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా 22ఎ (నిషేధిత జాబితా)లో భూములు చేర్చడం చట్ట ఉల్లంఘనే అని విశ్రాంత ఇంటెలిజెన్స్ డిజి ఎ.బి వెంకటేశ్వరరావు అన్నారు. సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల ఎకరాల భూములను 22ఎలో చేర్చి రైతు కుటుంబాలను ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే భూములను నిషేధిత జాబితాలో చేర్చి, ఏదో గొప్పగా జాబితా నుంచి తొలగిస్తున్నట్లు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో రైతులతో ముఖ్యమంత్రి చప్పట్లు కొట్టించుకుంటున్నారని విమర్శించారు. రైతుల భూములను దొంగతనంగా జాబితాలో చేర్చిన వారి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు, సన్మానాలు చేయడమేమిటని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు, నాయకులకు 22ఎ జాబితాలో భూములను చేర్చడం ఒక ఆదాయ వనరుగా మారిందని ఆరోపించారు. రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చడమే పరిపాలనా సామర్థ్యమా? అని ప్రశ్నించారు. జాబితాలో చేర్చిన ప్రతి ఎకరాను 22ఎ నుంచి తొలగించే వరకూ సెంటర్ ఫర్ లిబర్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. భూములను అత్యవసరంగా క్రయవిక్రయాలు చేయాలనుకున్నా, తాకట్టు పెట్టాలకున్న వారి సహాయార్థం విజయవాడలో ఒక సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులకు నోటీసులు ఇవ్వకుండా, క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ చేయకుండా ఏకపక్షంగా 22ఎలో చేరుస్తూ విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసి 15 లక్షల కుటుంబాలకు విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లాకు చెందిన 22ఎ బాధితులతో కలిసి కలెక్టరేట్ లో వినతిపత్రం అందజేశారు.
Print Editionనోటీసులు ఇవ్వకుండా 22ఎలో చేర్చడం చట్ట ఉల్లంఘనే : ఎ.బి వెంకటేశ్వరరావు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 09:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)