మళ్లీ నిరసనలు చేపడతామంటూ దీప్కే వ్యాఖ్యలు
హాల్ దొరక్కుండా ఆటంకాలు సృష్టిస్తున్న బిజెపి
న్యూఢిల్లీ : జంతర్ మంతర్ ఉద్యమం సీజన్ 2 త్వరలో ప్రారంభం కానుందని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజత్ దీప్కే సూచనప్రాయంగా తెలిపారు. సీజన్ 2 ఎప్పడు అని చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతున్నారని, వారందరికీ నా సమాధానం త్వరలోనే అని చెప్పారు. యువత సమస్యలపై సిజెపి చేపట్టిన పలు కార్యక్రమాలు, ప్రకటనల నేపథ్యంలో దీప్కే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అయితే తాజా నిరసనల దశ ఎప్పటి నుండి, ఎక్కడ నుండి ప్రారంభమవుతుందనే వివరాలు దీప్కే వెల్లడించలేదు. అలాగే ప్రత్యేకంగా ఏ డిమాండ్లపై దృష్టి కేంద్రీకరిస్తున్నారనేది కూడా తెలియరాలేదు. అయితే సిజెపి మళ్ళీ జంతర్ మంతర్ వద్దకు రావడానికి సిద్ధమవుతుందనే సూచనలు మాత్రం వెలువడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో స్కూలు విద్యార్ధులు తమ స్కూలుకు సరైన రోడ్డు వేయాలంటూ ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నిర్వహించిన ప్రదర్శనకు దీప్కే మద్దతునిచ్చారు. ఈ ప్రదర్శనలో 300మంది విద్యార్ధులు, 100మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఈ డిమాండ్ దశాబ్దాల క్రితమే నెరవేరాల్సిందని వ్యాఖ్యానిస్తూ ఆ విద్యార్ధలను దీప్కే ప్రశంసించారు.
వలంటీర్ల సమావేశానికి ఇబ్బందులు
ఢిల్లీలో వలంటీర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడంలో సిజెపి అనేక ఇబ్బందులను ఎదుర్కొందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీప్కే తాజా వ్యాఖ్యలు వెలువడ్డాయి. సమావేశానికి ఒక వేదిక అంటూ పార్టీకి దొరకలేదు. తమకు పై నుండి ఒత్తిళ్లు వున్నాయంటూ అనేకమంది హాల్ యజమానులు చెబుతున్నారు. ఎట్టకేలకు సిజెపి ఒక హాల్‌ను తీసుకోగలిగింది, కానీ సమావేశం జరిగే రోజు ఉదయమే ఆ హాల్ యజమానులకు బెదిరింపులు వచ్చాయని చెప్పారు. సిజెపి సమావేశానికి అనుమతించవద్దని వారిని గట్టిగా హెచ్చరించారని దీప్కే విమర్శించారు. ఈ ఒత్తిడి తెచ్చేది బిజెపినే అని, దేశ యువత అంటే ఆ పార్టీ భయపడుతోందని దీప్కే వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలతో సిజెపిని అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)