ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎపి ఐసెట్–2026) తొలి విడత వెబ్ కౌన్సెలింగ్‌లో మొత్తం 8,059 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 46,464 సీట్లు అందుబాటులో ఉండగా, తొలి విడతలో 8,059 సీట్లు భర్తీ కాగా, మరో 38,405 సీట్లు ఖాళీగా ఉన్నాయని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎపి ఐసెట్ తొలి విడత వెబ్ కౌన్సెలింగ్‌కు సంబంధించి కన్వీనర్ ఆగస్టు 20న నోటిఫికేషన్ జారీ చేశారు. 24 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు, ఆప్షన్ల మార్పు తదితర ప్రక్రియలు పూర్తయ్యాయి. మొత్తం 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, వీరిలో 9,122 మంది కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 9,122 మంది అర్హులుగా తేలారు. మొత్తం 8,410 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేశారు. ఎంబిఎ కోర్సుల్లో విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కలిపి మొత్తం 29,762 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 5,306 సీట్లు భర్తీ కాగా, 24,456 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎంసిఎ కోర్సుల్లో మొత్తం 16,702 సీట్లు అందుబాటులో ఉండగా, తొలి విడతలో 2,753 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 13,949 సీట్లు ఖాళీగా ఉన్నాయి. క్రీడా కోటాకు సంబంధించిన 199 సీట్లను ఈ విడతలో కేటాయించలేదు. ఎపి క్రీడా ప్రాధికార సంస్థ నుంచి తుది అర్హత జాబితాలు అందకపోవడంతో ఈ సీట్లను పక్కన పెట్టినట్లు అధికారులు తెలిపారు. తదుపరి విడత కౌన్సెలింగ్‌లో క్రీడా కోటా సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 16లోగా స్వయంగా కేటాయించిన కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కళాశాలల్లో తరగతులు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి.







కామెంట్‌లు (0)