పంగిడిగూడెం సీలింగ్ భూముల సాగుదారులకు పట్టాలు, పాస్‌బుక్కులు ఇవ్వాలి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో సీలింగ్ భూములను సాగు చేస్తున్న పేదలకు ప్రభుత్వం పట్టాలు, పాస్‌బుక్కులు మంజూరు చేసి, వారి సాగు భూములకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు ర్యాలీగా పంట భూములకు చేరుకుని, వారు సాగు చేస్తున్న భూముల్లో ఎరువులు చల్లి పంటను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తాయని చెబుతున్న ప్రభుత్వం, సీలింగ్ భూములను సాగు చేసుకుంటున్న పేదల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సీలింగ్ చట్టం ప్రకారం భూమిలేని పేదలు భూములను సాగు చేసుకుంటే వారిపై అక్రమ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. 15 ఏళ్లుగా పేదలు భూముల కోసం పోరాడుతున్నారని, గత ఐదేళ్లుగా ఆయా భూముల్లో పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. పేదలు సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందన్నారు. సర్వే నంబర్ 215/3లో సుమారు 32 ఎకరాల సీలింగ్ భూములను పేదలు సాగు చేస్తున్నారని, అందులో సుమారు ఆరున్నర ఎకరాల్లో భూస్వాములు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు స్పందించాల్సిన సమయంలో పోలీసులు జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ అన్యాక్రాంతమైన సీలింగ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. పంగిడిగూడెంలో మిగిలి ఉన్న సీలింగ్ భూములను పేదలకు పంపిణీ చేసే వరకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.జీవరత్నం, స్థానిక నాయకులు ఎం.బాలరాజు, కె.సుబ్బారావు, జి.బాలయ్య, జి.మరియమ్మ, ఎ.కాంతమ్మ, ఎం.కుమారి, ఎస్.నాగమణి, డి.రాజు, బి.సురేష్, ఎం.రత్నకుమారి తదితరులతో పాటు సుమారు వంద మంది పేదలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)