ప్రజాశక్తి - విజయవాడ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావుపై గత వైసిపి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసును విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (3 ఎసిఎం) కోర్టు కొట్టివేసింది. 2024 జనవరి 21న అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం విజయవాడలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిపిఎం, సిఐటియు అండగా నిలిచాయి. ఆ సమయంలో బాబూరావు ఉద్యోగులను, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ నాటి వైసిపి ప్రభుత్వం పలు సెక్షన్లు (120(బి), 143, 153, 290, 506 ఆర్/డబ్ల్యు 149 ఐపిసి, 7(1) క్రిమినల్ అమెండ్‌మెంట్) కింద ఎఫ్‌ఐఆర్ 14/24 (సిసి నం.2444/24) కింద కేసు నమోదు చేసింది. ఈ కేసును విచారించిన విజయవాడ 3 ఎసిఎం కోర్టు... బాబూరావుపై పెట్టినది అక్రమ కేసుగా నిర్ధారిస్తూ మంగళవారం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో బాబూరావు తరఫున ప్రముఖ న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్, ఎస్.రమేష్ వాదనలు వినిపించారు. కోర్టు తీర్పు అనంతరం బాబూరావు మాట్లాడుతూ... ప్రజా ఉద్యమాలపై నమోదైన అక్రమ కేసులను తొలగిస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. నేతలు, పాలకులపై ఉన్న ఆర్థిక, అవినీతి కేసులను రద్దు చేసుకోవడానికి ప్రభుత్వ సొమ్మును, ప్రముఖ న్యాయవాదులను వినియోగిస్తూ కోర్టులకు హాజరుకాకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్బంధాలు, అక్రమ కేసులను ప్రజలు ఖండించాలని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజాసమస్యలపై సిపిఎం పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు.
Print Editionసిపిఎం నేత బాబూరావుపై అక్రమ కేసు కొట్టివేత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 10:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)