రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇఎఎస్.శర్మ లేఖ
స్పందించకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయిస్తానని హెచ్చరిక
ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టుల రద్దు, ఇండోసోల్‌కు భూ కేటాయింపులు, అదాని సోలార్ పవర్ ఒప్పందాలకు సంబంధించి పలు అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి ఇఎఎస్.శర్మ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. అందులోని వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కామ్‌లు) షిర్డీ సాయి కంపెనీకి సంబంధించిన స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టులను రద్దు చేసిన అనంతరం సదరు కంపెనీకి సుమారు రూ.2,500 కోట్లు చెల్లించాయని తెలిపారు. అందులో ఒక్క ఎపిఎస్‌పిడిసిఎల్ నుంచే రూ.764 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. అంత భారీ మొత్తాన్ని ఏ ప్రాతిపదికన ప్రైవేటు సంస్థకు చెల్లించాల్సి వచ్చిందో ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ చెల్లింపుల భారం చివరకు విద్యుత్ వినియోగదారులపైనే పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇండోసోల్ ప్రాజెక్టుకు సంబంధించి గత వైసిపి ప్రభుత్వ హయాంలో జిఒ నెంబర్ 66, 4 ద్వారా నెల్లూరు జిల్లాలో భూములు కేటాయించిన విషయాన్ని శర్మ ప్రస్తావించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఈ భూ కేటాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రస్తుత ప్రభుత్వం జిఒ 43 ద్వారా ఆ జిల్లాలోని ఉలవపాడు మండలం 16 గ్రామాల పరిధిలో 8,348 ఎకరాలకుపైగా భూములతోపాటు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో వ్యవసాయ భూములను ఇండోసోల్ ప్రాజెక్టు కోసం సేకరిస్తోందని, ఈ విషయంలో ప్రభుత్వాల వైఖరిలో స్పష్టమైన ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన అదాని సోలార్ పవర్ ఒప్పందంలో వైసిపి నాయకులకు అనుచిత చెల్లింపులు చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై అమెరికా కోర్టులో కేసు నమోదైన అంశాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ ఒప్పందంపై సమగ్ర విచారణ జరపాలని గతంలో కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. షిర్డీ సాయి, అదాని సంస్థలకు గత ప్రభుత్వం కాంట్రాక్టులు కేటాయించిన విధానం, స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టుల రద్దు అనంతరం రూ.2,500 కోట్ల చెల్లింపులు, గత ప్రభుత్వ హయాంలో ఇండోసోల్‌కు జరిగిన భూ కేటాయింపులు, ప్రస్తుత ప్రభుత్వం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇండోసోల్ 30 గిగావాట్ల ప్రాజెక్టు కోసం భూములు, ఖనిజ వనరుల కేటాయింపులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని శర్మ కోరారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)